Uttarkashi tunnel: కెమెరాకు కనిపించిన టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌;

Update: 2023-11-21 04:30 GMT

ఉత్తరాఖండ్‌లోని ఉత్తకాశీలో కూలిన టన్నెల్‌  రెస్క్యూ ఆపరేషన్‌ లో  భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సుమారు 240 గంటలతర్వాత తొలిసారిగా కెమెరాకు చిక్కారు. దీంతో గత 10 రోజులుగా వారిని బయటకు తీసుకురావడానికి శ్రమిస్తున్న సిబ్బందిలోనూ, ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకి కొత్త శక్తి వచ్చినట్టైంది. 

ఉత్తరాఖండ్.. ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు రంగంలోకి దిగారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు చెందిన ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధిపతి ఆర్నాల్డ్ డ్రిక్స్ ఘటనా స్థలికి వచ్చారు. సిల్‌క్యారాలోని సొరంగం కూలిన ప్రదేశంలో తన బృందంతో డ్రిక్స్‌ తనిఖీలు చేపట్టారు. తమ బృందమంతా ఇక్కడకి చేరుకొని పని చేస్తుందని సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు యత్నిస్తామని డ్రిక్స్‌ తెలిపారు. త్వరలోనే వారిని బయటకు తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులే కాకుండా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేవాళ్లు కూడా సురక్షితంగా ఉండడం ముఖ్యమన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ప్రణాళిక ప్రకారమే అద్భుతంగా జరుగుతోందన్నారు. కార్మికులకు ఆహారం, మందులు సక్రమంగా అందుతున్నాయన్నారు.


మరోవైపు, సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీఆరా తీశారు. ఈ విషయమై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. చిక్కుకున్న కార్మికులకు మనోధైర్యాన్ని ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఉందని మోదీ ఉద్ఘాటించారని ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం తెలిపింది. అవసరమైన రెస్క్యూ పరికరాలు, వనరులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య పరస్పర సమన్వయంతో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని వివరించింది. వైద్య బృందాలు కూడా ఘటనాస్థలంలో ఉన్నాయన్నాయని వెల్లడించింది. సొరంగం బయట తమ వారి కోసం వేచి చూస్తున్న బాధితుల కుటుంబాల ప్రయాణ, ఆహారం, వసతి ఖర్చులను ఉత్తరాఖండ్ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రకటించారు. కార్మికుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు మానసిక నిపుణులను కూడా రంగంలోకి దింపినట్లు ఆయన తెలిపారు.

ఈనెల 12 న బ్రహ్మకల్‌ - యమునోత్రి జాతీయ రహదారిపై సిల్‌క్యారా- దండల్‌గావ్‌ మధ్య సొరంగాన్ని తవ్వుతుండగా కొండచరియలు విరిగిపడి దాదాపు 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. తొమ్మిది రోజుల నుంచి వారిని బయటకు తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

Tags:    

Similar News