పార్లమెంట్‌ చరిత్రలోనే తొలిసారిగా షిఫ్టుల పద్ధతిలో సమావేశాలు

కరోనా ఎఫెక్ట్‌తో పార్లమెంట్‌ చరిత్రలోనే తొలిసారిగా ఉభయసభలూ షిఫ్టుల పద్ధతిలో సమావేశం కానున్నాయి. సోమవారం ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ, మంగళవారం..

Update: 2020-09-14 02:01 GMT

కరోనా ఎఫెక్ట్‌తో పార్లమెంట్‌ చరిత్రలోనే తొలిసారిగా ఉభయసభలూ షిఫ్టుల పద్ధతిలో సమావేశం కానున్నాయి. సోమవారం ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ, మంగళవారం నుంచి ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు రాజ్యసభ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమావేశాల నిర్వహణపై పలుమార్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సభలకు హాజరయ్యే ప్రతి సభ్యుడు విధిగా కొవిడ్‌ 19 పరీక్ష చేయించుకోవాలని సూచించారు. నెగిటివ్‌ వచ్చిన వారికే పార్లమెంట్‌ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుల్లో అధిక వయస్సువారే ఉండటంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బంది, ఇంటిలో పనివారికి కూడా కొవిడ్‌ 19 పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

పార్లమెంట్‌ సమావేశాలు నేపథ్యంలో కేంద్రం.. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించింది. భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలపై సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మంగళవారం పార్టీల నేతలతో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ చెప్పారు. ఈ నేపథ్యంలో లడఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిస్థితి సున్నితత్వాన్నిదృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జోషీ అన్నారు. సమస్య ఏదైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని చెప్పారు. సభ సజావుగా సాగేలా పార్టీలు సహకరించాలని స్పీకర్‌ ఓం బిర్లా సూచించారు.

అటు జీఎస్టీ వాటాపై పార్లమెంటులో చర్చిస్తామని నామా నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సమస్యలపై ప్రస్తావిస్తామని వెల్లడించారు. కరోనా ప్రభావం తర్వాత తొలిసారిగా సమావేశాలు జరుగుతున్నందున పార్లమెంట్‌ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభ్యులందరికీ ముందు జాగ్రత్తగా కిట్లు సరఫరా చేశారు. అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్స్‌, అన్ని రకాల వ్యవస్థలను అధికారులు సిద్ధం చేశారు. సందర్శకులకు అనుమతిలేదని ప్రకటించారు. పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశంపై పలు ఆంక్షలు విధించారు. 

Tags:    

Similar News