Anil Ambani : అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు షాక్..రూ.40 వేల కోట్ల స్కామ్‌పై సిట్ విచారణ.
Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు రెట్టింపయ్యాయి. గత కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆయన రిలయన్స్ గ్రూప్ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. అనిల్ అంబానీ గ్రూప్‌పై వస్తున్న దాదాపు రూ.40,000 కోట్ల భారీ కార్పొరేట్, బ్యాంకింగ్ మోసాల ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఈ సిట్, అంబానీ కంపెనీల గుట్టు రట్టు చేసేందుకు సిద్ధమైంది.
అనిల్ అంబానీ గ్రూప్‌పై సిట్ పంజా
రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలకు చెందిన దాదాపు రూ.40,000 కోట్ల బ్యాంకింగ్ మోసాల కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ అక్రమాలపై నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ జరిపించాలని గత వారం సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఈడీ ప్రధాన కార్యాలయంలోని ఇన్వెస్టిగేషన్ యూనిట్ అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలో ఒక శక్తివంతమైన సిట్ ఏర్పాటైంది. ఈ బృందంలో దాదాపు ఆరుగురు సీనియర్ దర్యాప్తు అధికారులు ఉన్నారు. వీరు అంబానీ కంపెనీల ఆర్థిక లావాదేవీలను జల్లెడ పట్టనున్నారు.
సీబీఐతో కుమ్మక్కు అయ్యారా?
ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం మరో సంచలన అంశాన్ని లేవనెత్తింది. అంబానీ గ్రూప్ వ్యవహారాలను విచారిస్తున్న సీబీఐ అధికారులతో కంపెనీ ప్రతినిధులు ఎవరైనా కుమ్మక్కయ్యారా? ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో కూడా విచారణ జరపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈడీ గతేడాది నుంచి అనిల్ అంబానీపై విచారణను ముమ్మరం చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మూడు కీలక కేసులు నమోదు చేయడమే కాకుండా, ఇప్పటివరకు అంబానీ గ్రూప్‌కు చెందిన సుమారు రూ.12,000 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
టార్గెట్‌లో ఉన్న కంపెనీలు ఇవే..
ప్రజల సొమ్మును, బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించడంలో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ సిద్ధహస్తులని ఈడీ ఆరోపిస్తోంది. ప్రధానంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్& కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & రిలయన్స్ పవర్ కంపెనీల లావాదేవీలపై సిట్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో ఆర్‌కామ్ మాజీ చైర్మన్ పునీత్ గార్గ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనిల్ అంబానీని కూడా గతంలోనే పిలిపించి గంటల తరబడి విచారించారు.
అంబానీ గ్రూప్ వాదన ఏంటి?
అయితే, అనిల్ అంబానీ గ్రూప్ ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతోంది. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, వ్యాపార నష్టాల వల్లే గ్రూప్ సంక్షోభంలో పడిందని గతంలోనే స్పష్టం చేసింది. కానీ, పబ్లిక్ ఫండ్స్‌ను పక్కదారి పట్టించినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. తాజా సిట్ దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఈ విచారణ వార్తలతో అంబానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నాయి.