ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ క్రిస్మస్ పండుగ వేళ శాంతాక్లాజ్ గా మారిపోయారు. ప్రజలకు బహుమతుల రూపంలో పథకాలు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఢిల్లీ ప్రజ లకు వారి సొంత శాంతా ఏడాది పొడవునా బహుమతులు ఇస్తూనే ఉన్నారని ఆప్ ఈ వీడియోకు వ్యాఖ్యను జత చేసింది. ఇది ఏఐ వీడియోనా? లేక కేజ్రివాల్ స్వయంగా శాంతాక్లాజ్ గెటప్ వేసుకున్నారా? అనే విషయాన్ని వెల్లడించలేదు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వినూత్న ప్రచారానికి ఆప్ స్వీకారం చుట్టింది. ప్రస్తుతం ఉచిత కరెంటు, విద్య, వైద్యం సహా ఇతర పథకాలను లబ్దిదారులు పొందుతున్నారు. తాము మరోసారి అధికారం లోకి వచ్చాక 'మహిళా సమ్మాన్ యోజన' కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఆర్థికసాయం, సీనియర్ సిటిజన్లకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.