జార్ఖండ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శిబూ సోరెన్ (81) కన్నుమూసారు. ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజిక సంస్కర్త గా ఆయన జీవితం నేటి సమాజానికి స్పూర్తి గా నిలుస్తోంది. చాలా రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గురూజీ మనందరినీ విడిచి పెట్టీ వెళ్ళారు అని ఆయన పేర్కొన్నారు. గత నెల రోజులుగా డిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
1944 జనవరి 11న జన్మించిన శిబూ సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం నడిపిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. ఆదివాసీ నాయకుడిగా, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) స్థాపకుడిగా ఆయన చేసిన కృషి రాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.