గతంలో ఎన్నడూలేని విధంగా దేశవ్యాప్తంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రికార్ధుస్థాయిలో నమోదవుతోన్న ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయి. దీంతో వేడిగాలులకు పిల్లలు, వృద్ధులే కాదు యువకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధిక ఎండల కారణంగా వాహనాల కూడా మంటలకు కాలిబూడిదవుతున్నాయి. తాజాగా, ఎండ తీవ్రతకు నాలుగు బస్సులు దగ్దమైన ఘటన ఒడిశాలో శనివారం చోటుచేసుకుంది. రాయగడ జిల్లా బిసంకటక్ బస్టాండులోని ఆగి ఉన్న బస్సుల్లో మంటలు చెలరేగాయి.
ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బస్సుల నుంచి దిగిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే మిగతా బస్సులకు మంటలు వ్యాపించి ఉంటే భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగుండేది. బిసంకటక్ బస్టాండులో దగ్దమైన బస్సులను ప్రయివేట్ ట్రావెల్స్‌కు చెందినవిగా గుర్తించారు. రాయగడకు చెందిన కిరణ్ కుమార్ సాహు అనే వ్యక్తి వీటిని నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు బస్సుల్లో మధ్యలో ఉన్న రెండు వాహనాలు నుంచి తొలుత మంటలు చెలరేగాయి. అనంతరం మిగతావాటికి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు చేసుకుని మంటలను అదుపుచేశారు. రెండు బస్సులు పూర్తిగా దగ్దం కాగా.. మరో రెండు కూడా సగం కాలిపోయాయి. ఈ బస్సులు బిసంకటక్ నుంచి రాయగడ, గుణుపూర్, మునిగూడ ప్రాంతాలకు వెళ్లాల్సినవని తెలిపారు.
మరోవైపు, ఎండలకు ఒడిశాలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడచిన 48 గంటల్లో ఆ రాష్ట్రంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బ మృతుల్లో ఎక్కువ పశ్చిమ ఒడిశా జిల్లాల్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా బలన్‌గిర్ జిల్లాలో 20 మంది మృతిచెందగా.. సంబల్‌పూర్‌లో 15 మంది, ఝార్సుగూడ, సోనేపూర్‌లో ఆరుగురు చొప్పున, కెంఝోర్‌లో నలుగురు, సుందర్‌గఢ్‌లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మొత్తం ఇప్పటి వరకూ వడదెబ్బ మరణాలు 96కు చేరినట్టు ప్రభుత్వం ధ్రువీకరించింది.