Cigarette Prices: సిగరెట్ ధర ఇకపై రూ.18 కాదు రూ.72..?
ఈ దెబ్బకి పొగ తాగే అలవాటు మానుకోవాల్సిందే.!
న్యూ ఇయర్ వేళ సిగరెట్ ప్రియులకు చేదు వార్త వచ్చింది. సిగరెట్ ధరలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్, బీడీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా పన్ను నిర్ణయాల వల్ల ఈ ఉత్పత్తులపై వినియోగదారులకు అదనపు భారం పడనుంది. పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించనుండగా, బీడీలపై 18 శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. అంతేకాకుండా పాన్ మసాలాపై ఆరోగ్య సెస్‌తో పాటు జాతీయ భద్రత సెస్‌ను కూడా ప్రభుత్వం విధించింది.
జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ కూడా వర్తించడంతో సిగరెట్, బీడీ ధరలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్క సిగరెట్ సుమారు రూ.18కి లభిస్తుండగా, ఫిబ్రవరి 1 నుంచి దాని ధర రూ.72 వరకు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా పాన్ మసాలా ధరలు కూడా జీఎస్టీ, సెస్ ప్రభావంతో భారీగా పెరగనున్నాయి. ఈ నిర్ణయంతో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ధరల పెరుగుదలతో సామాన్య వినియోగదారులపై భారం పెరగనుందని, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే..ఈ అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇంత ధర పెట్టి కొనడం కంటే మానేయడమే ఉత్తమం మని కొందరు అంటున్నారు. సిగరెట్ లేకున్న బీడీలతో అడ్జెస్ట్ అవుతామని మరి కొందరు చర్చను మొదలు పెట్టారు.