Nirmala Sitharaman : రూపీ పతనానికి గ్లోబల్ పరిస్థితులే కారణం

Update: 2025-02-12 10:15 GMT

డాలర్ తో రూపాయి విలువ 88కి చేరువ కావడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలు అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి డాలర్ ఇండెక్స్ 6.5 శాతం పెరిగిందన్నారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. రూపాయి-డాలర్ మారకంలో హెచ్చుతగ్గులు ఎల్లప్పుడూ ఉంటాయని, యూరోతో సహా అనేక కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతున్నదని, కనుక ఇది నిజంగా డాలర్ ఇష్యూ అని రాజన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేశారు. అక్టోబర్ 2024 మరియు జనవరి 2025 మధ్య డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 3.3శాతం క్షీణించింది. మిగతా ఆసియా దేశాలతో పోల్చుకుంటే తక్కువే. ఈ కాలంలో, దక్షిణ కొరియా వాన్, ఇండోనేషియా రూపాయి వరుసగా 8.1శాతం, 6.9శాతం క్షీణించాయి. యూరో, బ్రిటిష్ పౌండ్ వరుసగా 6.7శాతం, 7.2 శాతం తగ్గాయని వివరించారు. రుణ సమీకరణ తగ్గించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపైనా నిర్మల మాట్లాడారు. 2021 నుండి రుణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాలరెన్స్ బ్యాండ్ 2-6 శాతం పరిధిలోనే ఉందన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేదా సరఫరా గొలుసు అంతరాయాల వల్ల ఆహార ద్రవ్యోల్బణం ప్రభావితమైందన్నారు.

Tags:    

Similar News