Goa: గోవాలోని నైట్‌క్లబ్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి

మృతుల్లో నలుగురు పర్యాటకులు, మిగతావారు క్లబ్ సిబ్బంది

Update: 2025-12-07 00:30 GMT

గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వంటగదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ అనే నైట్‌క్లబ్‌లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు పర్యాటకులు ఉండగా, మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు మంటల్లో సజీవదహనం కాగా, 20 మంది పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు.

ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. క్లబ్‌లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తెలిసిందని, విచారణలో నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

ఈ ప్రాంతంలోని అన్ని నైట్‌క్లబ్‌లలో తనిఖీలు చేపడతామని, అనుమతులు లేని వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతేడాది ప్రారంభమైన ఈ క్లబ్‌లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది.

Tags:    

Similar News