Central Government : అన్నదాతలకు శుభవార్త.. నాలుగు రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు.

Update: 2025-08-26 07:15 GMT

తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఖరీఫ్ సీజన్ లో పంటలకు కీలకంగా అవసరం అయిన యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు అన్నదాతలు. అయితే సరఫరా తక్కువగా ఉండటంతో యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని విమర్శిస్తోంది.

కాగా ఈ గందరగోళ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం రైతులకు ఉపశమనం ఇవ్వనుంది. మొత్తం నాలుగు రాష్ట్రాలకు గాను 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు 8,100 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 10,800, బీహార్‌కు 2,700 మరియు ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారు. ఈ యూరియా త్వరలోనే ఆయా రాష్ట్రాలకు చేరుకోనుంది. అయితే తాజా నిర్ణయంతో రైతుల సమస్య కొంత మేర తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News