Government Scrap Sale : కేంద్ర ప్రభుత్వం రికార్డు.. చెత్తతో రూ.4000కోట్ల సంపాదన.
Government Scrap Sale : కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన పాత వస్తువులు, నిరుపయోగ ఫైళ్లను తొలగించి కార్యాలయాలను శుభ్రపరిచే మెగా స్వచ్ఛతా అభియాన్ ఇటీవల భారీ విజయాన్ని సాధించింది. గత నాలుగైదేళ్లలో నిర్వహించిన అతిపెద్ద పరిశుభ్రతా ఉద్యమం ఇదే కావడం విశేషం. ఈ అక్టోబర్ 2 నుండి 31 వరకు జరిగిన ఈ ప్రచారంలో కేవలం ఒక్క నెలలోనే ప్రభుత్వానికి సుమారు రూ.800 కోట్ల ఆదాయం లభించింది. ఈ శుభ్రతా ఉద్యమం వివరాలు, గత నాలుగు సంవత్సరాలలో ఈ స్క్రాప్ అమ్మకాల ద్వారా ప్రభుత్వం ఎంత ఆదాయం పొందిందనే వివరాలను తెలుసుకుందాం.
ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన నిరుపయోగ వస్తువులు, పాత ఫైళ్లను తొలగించేందుకు కేంద్రం పెద్ద ఎత్తున స్వచ్ఛతా అభియాన్ చేపట్టింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగింది. ఈ అభియాన్‌లో మొత్తం 11.58 లక్షల కార్యాలయ స్థలాల్లో శుభ్రత నిర్వహించారు. ఇక్కడ పేరుకుపోయిన దాదాపు 29 లక్షల ఫైళ్లను తొలగించారు. తొలగించిన ఈ ఫైళ్లు, ఇతర స్క్రాప్ వస్తువుల అమ్మకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కేవలం ఒక్క నెలలోనే దాదాపు రూ.800 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పరిశుభ్రత కారణంగా 232 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ నిరుపయోగ వస్తువుల నుంచి విముక్తి పొందింది.
కేంద్ర ప్రభుత్వం 2021లో ఈ శుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్ర్కాప్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం ఆశ్చర్యకరంగా ఉంది. 2021లో ప్రారంభించినప్పటి నుంచి 2025 వరకు ప్రభుత్వం నిర్వహించిన ఈ అభియాన్‌ల ద్వారా రూ.4,097.24 కోట్లు (సుమారు రూ.4,100 కోట్లు) ఆదాయం లభించింది. 2021 నుంచి 2025 వరకు ప్రభుత్వం మొత్తం ఐదు సార్లు ఈ శుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ ఐదు ప్రచారాల్లో 23.62 లక్షల కార్యాలయ స్థలాలలో శుభ్రత నిర్వహించారు. మొత్తం 166.95 లక్షల కడతాలను తొలగించారు. 928.84 చదరపు అడుగుల స్థలాన్ని స్ర్కాప్ లేకుండా చేశారు. ఈ మెగా శుభ్రతా అభియాన్‌ను పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (DARPG) పర్యవేక్షించింది. ఈ విభాగం కేంద్రంలోని 84 మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయాన్ని సాధించడానికి కృషి చేస్తుంది. ఈ శుభ్రతా కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవియా, రామ్మోహన్ నాయుడు, డా. జితేంద్ర సింగ్ వంటి సీనియర్ మంత్రులు పర్యవేక్షించారు. ఈ అభియాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రత్యేక ఆసక్తి చూపారని, ఇది కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదపడిందని తెలుస్తోంది.