Nuclear Energy : అణుశక్తి రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు..శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లు..మోదీ ప్రకటన.
Nuclear Energy : రాబోయే సంవత్సరాల్లో దేశంలో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, అలాగే కర్బన ఉద్గారాలను సున్నాకు తగ్గించడానికి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుతున్న ప్రభుత్వం, ఇప్పుడు అణు విద్యుత్ ఉత్పత్తి పై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా, ఈ రంగంలోకి ప్రైవేట్ సంస్థలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు. అణుశక్తి రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రోజున హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ నిర్మించిన విక్రమ్-1 శాటిలైట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతించడం ద్వారా అనేక ఆవిష్కరణలు సాధ్యమయ్యాయని, అదే విధానాన్ని అణుశక్తి రంగానికి కూడా వర్తింపజేస్తామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి అనేది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల చేతిలోనే ఉంది. ఈ కారణంగా ఈ రంగంలో ఆశించినంత వేగంగా అభివృద్ధి సాధించలేకపోతున్నామని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించి, ప్రైవేట్ సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద అణుశక్తి ఉత్పత్తిదారు అయిన అమెరికాలో దాదాపు 30% అణు విద్యుత్‌ను ప్రైవేట్ రంగమే ఉత్పత్తి చేస్తోంది. అయితే, చాలా ఇతర దేశాల్లో మాత్రం ఇది ఇంకా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించడానికి చట్టాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి అనుగుణంగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 10 ముఖ్యమైన బిల్లులలో అణుశక్తి బిల్లు కూడా ఒకటిగా ఉంది. ఈ బిల్లు ద్వారా 1962 అటామిక్ ఎనర్జీ చట్టం, 2010 సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టంలకు సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.