Himachal Pradesh: 'జాతీయ విపత్తు’గా ప్రకటించాలి : హిమాచల్ సీఎం
కోలుకోలేని దెబ్బ తీసిన వర్షాలు;
కుండపోతతో నిలువెల్లా తడిసి వడలిపోయిన హిమాచల్ ప్రదేశ్‌ను వరద కష్టాలు వీడటం లేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నిలువునా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్ మొత్తం ప్రకృతి విపత్తుల ప్రభావిత ప్రాంతమని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని కూడా చవి చూసిన హిమాచల్ వరదలను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. జాతీయ విపత్తుగా కూడా ప్రకటించాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం రాష్ట్రం వేచిచూస్తోందన్నారు. గతంలో ఎన్నడూచూడనంత ప్రాణ, ఆస్తి నష్టం ఈ వర్షాకాలంలో సంభవించిందని తాజా నోటిఫికేషన్‌లో ప్రభుత్వం తెలిపింది. ఎడతెరపిలేని వర్షాలు, కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైందని పేర్కొంది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే నష్టంపై పూర్తి అంచనా సాధ్యమని తెలిపింది. కాగా, సుమారు రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. కేంద్రం సకాలంలో సాయం అందించాలని కోరారు.
ఈ వర్షా కాలం ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు 9,600 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసం కాగా పది వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. 170 వరకూ కొండచరియలు విరిగిపడిన, పిడుగులు పడిన ఘటనలు జరిగినట్లు, రాజధానికి పోయే ప్రధాన రహదారితో పాటు 621 రోడ్లు దెబ్బతిన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 752 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. వాస్తవంలో ఈ లెక్కలు ఇంకాస్త ఎక్కువే గానీ తక్కువ కాదన్నది మనకి తెలిసిన విషయమే.ఇక గత వారం రోజులుగా హిమాచల్‌లో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని నదులు పొంగి ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 74 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకో 3 రోజుల వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.