Gujarat : సూర్య నమస్కారాల్లో గుజరాత్ గిన్నీస్ రికార్డు
ఒకే సమయంలో 108 ప్రదేశాల్లో సూర్య నమస్కారాలు..;
ఒకే సమయంలో 108 ప్రదేశాల్లో వేలాది మంది సూర్య నమస్కారాలు చేసి గుజరాత్ వాసులు సరికొత్త గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. తద్వారా కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. మోఢేరాలోని సూర్యదేవాలయంలో జరిగిన సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూర్య నమస్కారాల్లో గుజరాత్ సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది. మోఢేరాలోని సూర్య దేవాలయం సహా 108 ప్రదేశాల్లో వేలాది మంది సూర్య నమస్కారాలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. కొత్త సంవత్సరం తొలిరోజునే ఈ ఘనత సాధించారు.
సూర్య నమస్కార కార్యక్రమం, కాంపిటిషన్‌ను గుజరాత్‌లోని 108 ప్రదేశాల్లో గుజరాత్ రాష్ట్ర యోగా బోర్డు నిర్వహించింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్య నమస్కార పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలకు బహుమతులు అందజేశారు.
విశేషమైన ఘనతను సొంతం చేసుకుని గుజరాత్ 2024 ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 108 అనే సంఖ్యకు భారత సంస్కృతిలో విశేషమైన ప్రాధాన్యం ఉందన్నారు. యోగా సహా మన సాంస్కృతిక వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు ఇది నిదర్శమన్నారు. సూర్య నమస్కారాల వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, రోజువారీ కార్యకలాపాల్లో వీటిని భాగంగా చేసుకోవాలని ప్రజలను ప్రధాని మోదీ కోరారు. ఒకే సమయంలో ఎక్కువ మంది యోగా చేసిన రికార్డు కూడా గుజరాత్ పేరిటే ఉంది.