Money Laundering: 1500 కోట్ల మ‌నీల్యాండ‌రింగ్ కేసు..

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చోకర్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ..;

Update: 2025-05-05 06:30 GMT

 కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధ‌ర‌మ్ సింగ్ చొక‌ర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. సుమారు 1500 కోట్ల మ‌నీల్యాండ‌రింగ్ కేసులో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఓ హోట‌ల్ నుంచి అత‌న్ని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. హ‌ర్యానాలోని స‌మ‌ల్కా ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే ధ‌ర‌మ్ సింగ్ రాజ‌కీయాల్లో పేరుగాంచిన వ్య‌క్తి. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నిక‌య్యారు. ఇదే స్కామ్‌తో లింకున్న వ్య‌క్తుల‌ను ఈడీ అరెస్టు చేసింది. ధ‌ర‌మ్ సింగ్ కుమారుడు సికంద‌ర్ చొక‌ర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో అక్ర‌మాల‌కు పాల్పడిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. షెల్ కంపెనీల‌కు మ‌నీల్యాండ‌రింగ్ చేసిన‌ట్లు కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రియ‌ల్ ఎస్టేట్‌తో పాటు ఇత‌ర రంగాల్లో చోటుచేసుకున్న ఆర్థిక అక్ర‌మాల నేప‌థ్యంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 2023లో గురుగ్రామ్ పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచార‌ణ చేప‌ట్టింది.

మాజీ ఎమ్మెల్యే ధ‌ర‌మ్ చోక‌ర్ అత‌ని కుమారులు ఇద్ద‌రు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. 1500 ఇండ్లు క‌ట్టిస్తామ‌ని చెప్పి సుమారు 363 కోట్లు వ‌సూల్ చేశారు. గురుగ్రామ్‌లో సెక్టార్ 68లో ఇండ్ల నిర్మాణం చేప‌ట్టనున్న‌ట్లు చెప్పారు. 2021-22 నాటికి ఇండ్ల‌ను క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ ఆ క‌మిట్‌మెంట్‌కు క‌ట్టుబ‌డి లేరు. మ‌హిర గ్రూపున‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు జ‌రిగాయి. కంపెనీ డైరెక్ట‌ర్లు డ‌బ్బును అక్ర‌మంగా త‌రలించిన‌ట్లు ఈడీ ఆరోపించింది. నిర్మాణ ఖ‌ర్చుల‌కు చెందిన న‌కిలీ ప‌త్రాలు చూపించారు.

ఫేక్ బిల్లులు, ఇన్‌వాయిస్‌లు చూపించి.. మ‌హిరా డైరెక్ట‌ర్లు ఆ డ‌బ్బును వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు వాడిన‌ట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. మ‌హిర గ్రూపున‌కు చెందిన వాహ‌నాలు, న‌గ‌దు, బంగారం, న‌గ‌లను 2023 జూలైలో సీజ్ చేశారు. 2009లో తొలిసారి హ‌ర్యానా జ‌న‌హిత్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. ఇక ఆ త‌ర్వాత కాంగ్రెస్ లో చేరారాయ‌న‌. 2014లో ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. మ‌ళ్లీ 2019లో స‌మ‌ల్కా నుంచి ఆయ‌న గెలిచారు.

Tags:    

Similar News