ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని అకాల వర్షాలు ముంచెత్తాయి. ఇవాళ తెల్లవారు జామున ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నలుగురు మృత్యువాత పడ్డారు. వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో 120 విమానాల రాకపోకల కు అంతరాయం ఏర్పడంది. 40 విమానాలను దారి మళ్లించినట్టు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. రానున్న కొన్ని గంటల్లో ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రాజధానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు లు వీస్తున్నాయి. ఇప్పటికే తెల్లవారుజామున కురిసిన వర్షానికి లజపత్ నగర్, ఆర్కేపురం, ద్వారక తదితర ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాగా ద్వారక ప్రాంతంలో భారీ ఈదురు గాలులకు ఓ వృక్షం ఇంటి పై పడింది. దీంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, ముగ్గురు పిల్లలు సజీవ సమాధి అయ్యారు. ఈదురు గాలుల కారణంగా చెట్లు కూలాయి. భవనాలు ధ్వంసం అయ్యాయి. కరెంటు స్థంభాలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ సమీపంలోని హర్యానా లోనూ భారీ వర్షం కురిసింది. ఝజ్జర్ ప్రాంతంలో కురిసిన వర్షానికి రహదారులన్నీ నదుల్లా మారాయి. మండుటెండల్లో ఊహించని వర్షా నికి ఢిల్లీ, హర్యానా అతలాకుతలమయ్యాయి.