Bangalore Rains : జలదిగ్బందంలో బెంగళూరు..

Bangalore Rains : భారీ వర్షాలకు బెంగళూరు చిగురుటాకులా వణికింది.;

Update: 2022-09-06 10:33 GMT

Bangalore Rains : భారీ వర్షాలకు బెంగళూరు చిగురుటాకులా వణికింది. 13 సెంటీమీటర్ల మేర కుండపోతగా కురిసిన వర్షాలతో అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు, కాలువులు పొంగిపొర్లుతున్నాయి. సహాయక చర్యల కోసం ప్రభుత్వ అధికారులు పడవలు, ట్రాక్టర్లను రంగంలోకి దించారు.

ఐటీ కంపెనీలుండే ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతం ఇంకా జలదిగ్భందంలోనే ఉంది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లపై వరదలు ఉధృతంగా ప్రహిస్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆస్పత్రుల్లోకి నీరు చేరింది. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బెంగళూరులో 48 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇప్పటికే అపార్టుమెంట్లు, ఇళ్ల ఎదుట పార్కు చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ప్రధానంగా వైట్‌ఫీల్డ్, ఇందిరానగర్, కాంగేరి, ఆర్‌ఆర్‌నగర్‌, బొమ్మనహళ్లి, మారథాళ్లి, మహాదేవపురాలో వరదల తీవ్రత అధికంగా ఉంది. భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల ఊహించని ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.

వరద నీటితో నిండిన రోడ్డుపై వెళుతోన్న ఓ యువతి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతిచెందింది. వైట్‌ఫీల్డ్‌ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని.. తన కూతురు చావుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతిరాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News