Kashmir Snow: మంచుకురిసే వేళలో .. పులకించిన కశ్మీర్
3 నెలల విరామం తర్వాత మళ్లీ కశ్మీర్‌లో మంచు
శీతాకాలం అంటే కశ్మీర్‌లో మంచుకురవాల్సిందే. కానీ గత మూడు నెలల నుంచి కశ్మీర్ లోయల్లో మంచు కురవలేదు. దీంతో అక్కడ టూరిజం ఇండస్ట్రీ దివాళా తీసింది. స్కీయింగ్‌కు గుల్మార్గ్ ఫేమస్. కానీ అక్కడ కొన్ని నెలల నుంచి మంచు ఆనవాళ్లే లేవు. హిమాలయాల్లో చాలా వరకు పర్వతాలు ఈ శీతాకాలంలో మంచు లేకుండానే దర్శనం ఇచ్చాయి. మంచు కరువుతో నిండిన ఆ ప్రాంతంలో నిన్నటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. వెస్ట్రన్ డిస్టర్బెన్స్‌తో అకస్మాత్తుగా ఇప్పుడు కశ్మీర్‌తో పాటు అనేక ప్రాంతాల్లో మంచు, వర్షం కురుస్తున్నది. దీంతో అనేక టూరిస్టు కేంద్రాలు ఇప్పుడు స్నోఫాల్‌తో ఆకట్టుకుంటున్నాయి.
జమ్మూ జిల్లాలోని హిల్ రిసార్ట్ బటోట్ పట్టణంలో ఇవాళ భారీగా మంచు కురిసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో కూడా ఇవాళ మంచు భీకరంగా కురిసింది. జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌లో దట్టంగా మంచుపడింది. ధర్మశాలలో స్వల్ప స్థాయిలో వర్షం కురిసింది. కశ్మీర్‌లోని బదేర్వా వీధులన్నీ మంచుతో నిండిపోయాయి. అందాలతో కవ్వింపు చేసే ఈ ప్రాంతంలో చాన్నాళ్ల తర్వాత మంచు పడింది. దీంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. కొండ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం బదెర్వా పోలీసులు హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేశారు. మూడు నెలల తర్వాత దోడాలోని కొండ, లోయ ప్రాంతాల్లో మంచుపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎంతోకాలం ఎదురుచూసిన స్నో రావడంతో స్థానికులు సంతోషపడ్డారు.
బుద్గాం జిల్లాలోనూ తాజాగా మంచు కురిసింది. అనంతనాగ్ జిల్లాలో కూడా ఫ్రేష్‌గా స్నోఫాల్ నమోదు అయ్యింది. దీంతో అక్కడ ల్యాండ్‌స్కేప్ మారిపోయింది. షిమ్లాతో పాటు చంబా, కులు, లాహుల్, స్పిటి, కంగ్రా ప్రాంతాల్లో మంచు కురిసింది. రియాసీ ప్రాంతంలో కూడా మంచు పడింది. పవిత్ర వైష్ణవోదేవి క్షేత్రం ఇప్పుడు స్నోతో నిండిపోయింది. దీంతో త్రికూట పర్వతం ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. యాత్రికులు తమ ట్రిప్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.