కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. ఖురేషిపై ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు, ఆయనపై తక్షణమే పోలీసు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కల్నల్ సోఫియా ఖురేషిని ఉద్దేశించి విజయ్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో, విషయం న్యాయస్థానం దృష్టికి చేరింది. దీనిపై విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ హైకోర్టు, మంత్రి హోదాలో ఉన్న విజయ్ షా వ్యాఖ్యల విషయంలో తీవ్రంగా స్పందించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు చెందిన అత్యున్నత అధికారి డీజీపీని ఆదేశించింది.
పాక్ మతోన్మాదులు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడితే, వారి సోదరినే (సోఫియా ఖురేషి మతాన్ని ఉద్దేశించి) తాము పాకిస్థాన్ పంపి ఆపరేషన్ సిందూర్ చేపట్టామని మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కున్వర్ విజయ్ షా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.