SANATHAN DHARMA: అటు విమర్శ... ఇటు మద్దతు
తీవ్ర దుమారం రేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు... ఇండియా ఫ్రంట్ నేతలు క్షమాపణ చెప్పాలని రాజ్‌నాథ్‌సింగ్;
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి దానిని సమూలంగా నిర్మూలించాలంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై భాజపా సహా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఉదయనిధి స్టాలిన్‌ను.. ప్రతిపక్షాలు వెనకేసుకు వచ్చాయి. ప్రతీ వ్యక్తికి వాక్ స్వాతంత్ర్యం ఉంటుందని గుర్తు చేశాయి.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌లో భాజపా పరివర్తన్ యాత్ర మూడో విడత ప్రారంభం సందర్భంగా జైసల్మేర్‌లో జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ఇండియా ఫ్రంట్ నేతలు క్షమాపణలు చెప్పాలని, లేదంటే దేశం వారిని క్షమించదని రక్షణ మంత్రి అన్నారు. డీఎంకే నేతలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారని, అయినా కాంగ్రెస్ దానిపై నిశ్శబ్దంగానే ఉందని రాజ్‌నాథ్ మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే కూడా స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించలేదన్నారు. సనాతన ధర్మం వసుధైవ కుటుంబకం అనే సందేశాన్ని ఇస్తుందని, ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా పరిగణిస్తుందని రక్షణమంత్రి గుర్తు చేశారు.
సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆరోపించిన ఎం.కే. స్టాలిన్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. ఉదయనిధిని మంత్రివర్గం నుంచి తప్పించి కఠినచర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీ భాజపా చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా నేతృత్వంలోని బృందం తమిళనాడు భవన్‌లో నిరసన లేఖ సమర్పించింది. స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే ఆ పార్టీ హిందూ వ్యతిరేకి అనే ప్రజల అభిప్రాయం మరింత దృఢం అవుతుందని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు.
భాజపా సహా కేంద్రమంత్రుల విమర్శల జడివాన కురుస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రతీ వ్యక్తికి వాక్ స్వేచ్ఛ ఉంటుందని హస్తం పార్టీ గుర్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందన్నఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తమది సర్వ ధర్మం సమభవ సిద్ధాంతమని తెలిపారు. సమాన హక్కులు ఇవ్వని మతం రోగం అంత మంచిదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎద్దేవా చేశారు. సమానత్వాన్ని ప్రోత్సహించని.. మనిషిగా గౌరవం కల్పించని ఏ మతమైనా వ్యాధితో సమానమని ఖర్గే అన్నారు.