Wife Murder : ప్రియురాలితో పెళ్లికి నో చెప్పింద‌ని.. రెండో భార్య‌కు తగలబెట్టిన భర్త…

బీహార్‌లోని న‌లంద జిల్లాలో దారుణ ఘ‌ట‌న

Update: 2025-10-12 02:45 GMT

 ఓ భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. ప్రియురాలితో పెళ్లికి నో చెప్పింద‌ని.. త‌న రెండో భార్య‌కు భ‌ర్త నిప్పంటించాడు. ఈ దారుణ ఘ‌ట‌న బీహార్‌లోని న‌లంద జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. న‌లంద జిల్లాకు చెందిన వికాస్ కుమార్ ఐదేండ్ల క్రితం సునీత దేవి(25)ని వివాహం చేసుకున్నాడు. అత‌నికి అప్ప‌టికే పెళ్లి అయిన‌ట్లు సునీత‌ను వివాహ‌మాడిన త‌ర్వాత ఆమె త‌ల్లిదండ్రుల‌కు తెలిసింది. మొద‌టి భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండానే సునీత‌ను పెళ్లాడిన‌ట్లు తెలిసింది. దీంతో సునీత త‌ల్లిదండ్రులు వికాస్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తానికి అత‌ని కుటుంబ స‌భ్యులు న‌చ్చ‌జెప్ప‌డంతో సునీత త‌ల్లిదండ్రులు శాంతించారు.

కొన్నాళ్ల‌కు సునీత‌, వికాస్ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు జ‌న్మించారు. కానీ పుట్టిన వెంట‌నే ఆ పిల్ల‌లిద్ద‌రూ చ‌నిపోయారు. ఇక అప్ప‌ట్నుంచి కుమార్ సునీత‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. తాను త‌న ప్రియురాలిని పెళ్లి చేసుకుంటాన‌ని, అంగీక‌రించాల‌ని భార్య‌ను వేధిస్తున్నాడు. ఇందుకు సునీత ఒప్పుకోలేదు.

ఈ క్ర‌మంలో ఆమెపై ప‌గ పెంచుకున్న భ‌ర్త చంపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. శ‌నివారం నాడు ఆమెను ఓ గ‌దిలో బంధించి పెట్రోల్ పోశాడు. ఆ త‌ర్వాత సిలిండ‌ర్‌ను లీక్ చేసి నిప్పంటించాడు. పెట్రోల్ పోసి గ‌దిని మూసిన వెంట‌నే సునీత త‌న త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి.. వికాస్ దారుణాల‌ను వివ‌రించి, త‌న‌కు నిప్పంటిస్తున్న‌ట్లు తెలిపింది. అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లిదండ్రులు వికాస్ ఇంటికి చేరుకునేలోగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. ద‌హ‌న సంస్కారాలు కూడా చేసే ప‌నిలో వికాస్ కుటుంబ స‌భ్యులు నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే సునీత కుటుంబ స‌భ్యుల‌ను చూసి వికాస్‌తో పాటు అత‌ని కుటుంబ స‌భ్యులు పరారీ అయ్యారు.

మృతురాలి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు. ఫోరెన్సిక్ బృందాలు న‌మూనాల‌ను సేక‌రించారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌రలించారు. నిందితుల కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు

Tags:    

Similar News