కేరళలో వయనాడ్ జిల్లాలోని గబ్బిలాల్లో నిఫా వైరస్ ఉండే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. ICMR ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ కేరళ ఆరోగ్యశాఖమంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించి జరిపిన అధ్యయనాల ఆధారంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు. వయనాడ్ జిల్లాలో కొత్తగా నిఫా వైరస్ కేసులు వచ్చాయని దీని అర్థం కాదన్న ఆమె.. రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థను, సాధారణ ప్రజల్ని అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ సమాచారం వెల్లడించినట్లు చెప్పారు.
కేవలం వయనాడ్ జిల్లాలోనే కాకుండా కేరళలోని ఇతర జిల్లాల్లో ఉండే గబ్బిలాల్లోనూ నిఫా వైరస్ ఉండే అవకాశం ఉందన్నారు. గత నెలలో కొయ్‌కోడ్‌లో ఆరుగురికి నిఫా వైరస్ సోకడం, ఇద్దరు మృతిచెందిన నేపథ్యంలో ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని మంత్రి వీణాజార్జ్ మీడియాకు వివరించారు. వైరస్ సోకిన వారితో కాంటాక్టులో ఉన్నవారి క్వారంటైన్, ఐసోలేషన్ సమయం ముగిసిందన్నారు. నిఫా వైరస్ మరణాల రేటును దాదాపు 70-90 శాతం నుంచి 33శాతానికి పరిమితం చేయగలగడం గర్వించదగిన విషయమని చెప్పారు. నిఫాపై పోరాడేందుకు అవసరమైన నిబంధనలు జారీ చేసినట్లు చెప్పారు. నిఫా వైరస్‌పై పరిశోధన కోసం తమ రాష్ట్రంలో ఒక హెల్త్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసి.. అన్ని శాఖల సమన్వయంతో స్వతంత్రంగా పరిశోధన చేసే దిశగా ముందుకెళ్తున్నట్లు ఈ సందర్భంగా వీణాజార్జ్ వెల్లడించారు.
దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ వార్నింగ్ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. నిపాపై పరిశోధన కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీలో కేరళ వన్ హెల్త్ సెంటర్ ప్రారంభంకానున్నట్లు తెలిపారు. జంతువులు, పక్షలు కొరికిన పండ్లను తినకూడదని మంత్రి సలహా ఇచ్చారు. ఇతర జిల్లాల్లోనూ నిపా వైరస్ ఉందా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.