లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో...తదుపరి వ్యూహంపై చర్చించేందుకు...ఇండియాకూటమి నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు శరద్ పవార్, మమతాబెనర్జీ, స్టాలిన్, చంపయ్ సోరెన్, ఉద్ధవ్‌ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించటంతోపాటు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం...పాత మిత్రులైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌కుమార్‌ను సంప్రదించాలా వద్దా... అనే విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం, జేడీయూలు ఇప్పటికే ఇండియా కూటమిలో చేరికను తోసిపుచ్చాయి. ఎన్డీయేలోనే కొనసాగుతామని పేర్కొన్నాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌తోపాటు ఇతరులు...ఆయా పార్టీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ ఈసారి సొంతంగా మెజార్టీ స్థానాలు సాధించలేకపోయింది. భాజపా సారథ్యంలోని ఎన్డీయే మిత్రులతో కలిసి...290 స్థానాలు గెలుపొందింది.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీడీపీ, జేడీయూ వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై నేడు జరిగే ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారట. ఎన్డీయే కూటమిలో ఉన్న నితిష్‌ను ఇండియా కూటమి తమ వైపు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నితీష్‌కు ఉప ప్రధాని పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించినట్లు సమాచారం. బాబు తమ కూటమిలో చేరితో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆశచూపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇండియా కూటమి కీలక నేతలు చర్చలు జరుపుతున్నారట.