INDIA bloc:రాజ్యాంగ ప్రతితో పార్లమెంట్‌కు చేరుకున్న ఇండియా కూటమి ఎంపీలు
ప్రొటెం స్పీకర్ ఎన్నికకు నిరసనగా..
18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం లో ఈ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే, ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతి తో పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రినేత రాహుల్ గాంధీ సహా కూటమి నేతలంతా రాజ్యాంగ ప్రతులతో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ నిరసన చేపట్టారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకే నిరసన తెలుపుతున్నట్లు ఇండియా కూటమి సభ్యులు తెలిపారు. ప్రొటెం స్పీకర్ నియమించిన తీరు రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు.
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మహతాబ్‌ను నియమించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన ప్రకటనపై ఇండియా కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భర్తృహరి కంటే కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ సీనియర్ అని, దళితుడైనందు వల్లే సురేశ్‌కు ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. విపక్షాల ఆరోపణలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్ ఎంపికను సమర్థించుకున్నారు. మహతాబ్ వరుసగా ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, సురేష్ అలా కాలేదని చెప్పారు. సురేశ్ 2004 ముందు నాలుగుసార్లు, ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.