INDIA: అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం
52 మిలిటరీ ఉపగ్రహాల ప్రయోగం వేగవంతం.. ఇక అంతరిక్షం నుంచి సైనిక ఆపరేషన్లు;
'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్ అంతరిక్షంలో నిఘా సామర్థ్యాన్ని మరింత స్థాయికి చేర్చేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా చైనా, పాకిస్థాన్, హిందూ మహాసముద్ర పరిసర ప్రాంతాలపై నిఘా కొనసాగించేందుకు 52 సైనిక ఉపగ్రహాలను ఆవిష్కరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రియల్‌టైమ్ మానిటరింగ్ వంటి అత్యవసర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.26,968 కోట్లు ఖర్చు చేయనుంది. చైనా అంతరిక్ష రంగంలో వేగంగా పురోగమిస్తూ ఆధిపత్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, భారత ప్రభుత్వం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహాన్ని తయారు చేస్తోంది.
భవిష్యత్తు రక్షణ అవసరాల దృష్ట్యా...
ఉపగ్రహ నిఘాతో పాటు ఆపరేషన్ సమయంలో కచ్చితమైన మ్యాపింగ్ చేయడంలో భారత శాటిలైట్లు కీలక పాత్ర పోషించాయి. ఈ పరిస్థితుల్లో భారత్ భవిష్యత్తు రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 52 డిఫెన్స్ శాటిలైట్లను సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమం ఇప్పుడు ఊపందుకుంది. అలాగే సమగ్రమైన ‘సైనిక అంతరిక్ష సిద్ధాంతం’ కూడా చివరి దశలో ఉంది. ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్’ (SBS) కార్యక్రమం మూడవ దశను ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ గత సంవత్సరం అక్టోబర్‌లో ఆమోదించింది. ఇందులో మొత్తం 52 ఉపగ్రహాలను రూ. 26,968 కోట్ల వ్యయంతో తయారు చేసి ప్రయోగించాలని నిర్ణయించారు. వీటిలో 21 ఉపగ్రహాలను ఇస్రో తయారు చేయగా, 31 ఉపగ్రహాల తయారీ పనిని మూడు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. ఈ రక్షణ చర్యలు భవిష్యత్తులో భారత్ కు ఉపయోగపడనున్నాయి.
2026 నాటి మొదటి శాటిలైట్
మొదటి ఉపగ్రహం ఏప్రిల్ 2026 నాటికి ప్రయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 2029 చివరి నాటికి మొత్తం 52 ఉపగ్రహాలన్నీ అంతరిక్షంలోకి చేరుకుంటాయి. ఈ ప్రాజెక్ట్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (IDS) ఆధ్వర్యంలోని డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ (DSA) పర్యవేక్షణలో పూర్తవుతుంది. స్పేస్ బేస్ సర్వైలెన్స్ ఎస్బీఎస్ మూడోవిడత కార్యక్రమంలో భాగంగా.. ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మిగిలిన 31 శాటిలైట్స్‌ను మూడు ప్రైవేటుసంస్థలు అభివృద్ధి చేసి కక్ష్యలోకి చేర్చనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఉపగ్రహాన్ని ఏప్రిల్ 2026న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 2029 చివరికి మొత్తాన్ని అంతరిక్షంలోకి చేర్చనున్నారు. ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ప్రైవేటు సంస్థలకు బదలాయించి.. వాటికి ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామ్యం ఇవ్వనుంది. అత్యవసర సమయాల్లో వేగంగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇది ఉపయోగపడనుంది. లోఎర్త్, జియో స్టేషనరీ కక్ష్యలపై దృష్టిపెట్టే ఈ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పర్యవేక్షించనున్నారు. చైనా యాంటీ శాటిలైట్ సామర్థ్యానికి కౌంటర్‌గా కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.
దూకుడుగా చైనా
చైనా అంతరిక్షంలో తన బలాన్ని నిరంతరం పెంచుకుంటోంది. 2010లో కేవలం 36 ఉపగ్రహాలతో ప్రారంభమైన చైనా సైనిక అంతరిక్ష కార్యక్రమం 2024 నాటికి 1,000 కంటే ఎక్కువ ఉపగ్రహాలను చేరుకుంది. వీటిలో 360 ఉపగ్రహాలు ప్రత్యక్ష నిఘాతో పాటు నిఘా కార్యకలాపాల కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. గత సంవత్సరం PLA ఏరోస్పేస్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఆధునిక యుద్ధంలో అంతరిక్షాన్ని ‘అంతిమ హై గ్రౌండ్’గా పరిగణిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది.