Woman Attempt To Burn Cockroach: బొద్దింకను చంపడానికి అపార్ట్‌మెంటే కాల్చేసింది.. సౌత్ కొరియాలో దారుణం
దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక పొరుగింటి మహిళ మృతి
దక్షిణ కొరియాలోని ఒసాన్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో బొద్దింకల బెడదను తప్పించుకోవడానికి ఓ మహిళ చేసిన పనికి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లో మంటలు ఎగసిపడి దట్టమైన పొగ అలముకుంది. పక్క ఫ్లాట్ కు పొగ వ్యాపించడంతో ఊపిరి ఆడక ఓ మహిళ మరణించింది. వివరాల్లోకి వెళితే..
ఒసాన్ లోని ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్న మహిళ.. తన ఫ్లాట్ లో బొద్దింకల బెడద పెరిగిపోవడంతో వాటిని వదిలించుకోవడానికి ఫ్లేమ్ థ్రోయర్ ఉపయోగించింది. గ్యాస్ సాయంతో మంటలు ఎగిసిపడే ఈ పరికరాన్ని ఉపయోగించి బొద్దింకలను చంపేందుకు ప్రయత్నించింది. అయితే, బొద్దింక చావకపోగా ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుంది. క్షణాలలోనే మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్లాట్ నిండా దట్టమైన పొగ అలుముకుంది.
పక్కనే ఉన్న మిగతా ఫ్లాట్లలోకి పొగ వ్యాపించింది. పక్క ఫ్లాట్ లో ఉండే చైనా దంపతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రెండు నెలల వయసున్న తమ బిడ్డను కిటికీ నుంచి పొరుగింటి వ్యక్తికి అందించారు. ఆపై భర్త కూడా వెళ్లిపోగా.. పొగ ఎక్కువ కావడంతో దారి కనిపించక భార్య అదే ఫ్లాట్ లో ఉండిపోయింది. పొగకు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మరికొంతమంది కూడా అస్వస్థతకు గురయ్యారని, ప్రమాదానికి కారణమైన మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.