India Pakistan Talks: నేడే.. భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు..
ఏయే అంశాలపై చర్చించనున్నారంటే..;
భారత్ పాకిస్తాన్ నేడు మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంవోలు హాట్ లైన్ లో మాట్లాడుకోబోతున్నారు. కాల్పుల విరమణ, అనంతర పరిస్థితులపై ఇరు దేశాల మధ్య చర్చ జరగబోతోంది. కాల్పుల విరమణ, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై చర్చించబోతున్నారు.
సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్. ఈ నిబంధనల ఉల్లంఘనలపై పాక్ ను ప్రశ్నించబోతోంది భారత్. సింధు జలాలు, ఉగ్రవాదుల అప్పగింత వంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.
కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చినా పాక్ మళ్లీ రాత్రి డ్రోన్లతో దాడులకు పాల్పడిందని భారత త్రివిధ దళాల అధిపతులు వెల్లడించారు. మరోసారి పాక్ దాడులు కొనసాగితే తీవ్రమైన ప్రతి చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యకైనా పాక్ కు తగిన జవాబిస్తామని హెచ్చరించారు.
పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారంగానే ఆ దేశ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసినట్లు DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ప్రకటించారు. మే 7-10వ తేదీల మధ్య ఎదురుకాల్పుల్లో 35-40 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ వెల్లడించిందన్నారు. జమ్ము, ఉదంపూర్, పఠాన్ కోట్ పై దాడికి పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టామన్నారు. ఉగ్ర స్థావరాలపై దాడి చేసిందుకు పాక్ మన పౌరులపై దాడులకు దిగిందన్నారు. డ్రోన్ దాడులకు కౌంటర్ గా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలను అటాక్ చేశామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడం తప్ప భారత్ కు మరో మార్గం లేదని డీజీఎంవో స్పష్టం చేశారు.
ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని డీజీఎంవో రాజీవ్ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. పాక్, పీవోకేలోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశామన్నారు. భారత్ చేసిన మెరుపు దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారని ఆయన వెల్లడించారు.