India-Russia Summit: నేటి నుంచి రెండు రోజులు భారత్‌లో పుతిన్
కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈరోజు భారత్‌కు రానున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్ నుంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, జామార్లు, ఏఐ, ఇలా 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు.
గురువారం సాయంత్రం పుతిన్ ఢిల్లీలో దిగనున్నారు. అనంతరం మోడీతో ప్రత్యేక సమావేశం కానున్నారు. అటు తర్వాత రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ప్రధాని మోడీతో కలిసి పుతిన్ విందు ఆరగించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా రెండు దేశాలు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంచుకొనే అవకాశం ఉంది. ఇక శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అనంతరం రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు.
ఇక గురువారం భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఆండ్రే బెలౌసోవ్ సమావేశం కానున్నారు. ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు చేయడం, సుఖోయ్-30 యుద్ధ విమానాల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఇక పుతిన్ భద్రత కోసం రష్యా నుంచి 40 మందికి పైగా భద్రతా అధికారులు, సిబ్బంది ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్‌జీ భద్రతా అధికారులు పుతిన్ ప్రయాణించే మార్గాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనేక మంది స్నైపర్లు పుతిన్ కదలిక మార్గాన్ని ఎప్పటికప్పుడు కవర్ చేయనున్నారు. ఏఐ పర్యవేక్షణ, ఫేస్ రికగ్నైజేషన్ వంటి కెమెరాలను పుతిన్ భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. పుతిన్ ల్యాండ్ అయిన మరుక్షణం నుంచి ఆయనకు 5 లేయర్డ్ సెక్యూరిటీ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతుంది. ఎన్ఎస్‌జీ, ఢిల్లీ పోలీస్ అధికారులు బయట అంచెల భద్రతా విభాగంగా ఉంటారు. రష్యన్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ లోపలి వలయంలో ఉంటారు. రష్యా అధ్యక్షుడు.. మోడీని కలిసినప్పుడు ప్రధానికి భద్రత కల్పించే భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు అంతర్గత భద్రతా వలయాన్ని పర్యవేక్షిస్తారు.