India-UK Defense Deal : బ్రిటన్ నుండి ఆధునిక క్షిపణులు కొనుగోలుకు భారత్ డీల్.. రక్షణ రంగంలో భారీ ఒప్పందం.
India-UK Defense Deal : భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. బ్రిటన్ అత్యంత అధునాతన మార్ట్‌లెట్ క్షిపణులను కొనుగోలు చేయడానికి 350 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 3,500 కోట్లకు పైగా) భారీ ఒప్పందంపై ఇండియన్ ఆర్మీ సంతకం చేసింది. ఇటీవల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన రెండు దేశాలు, ఇప్పుడు రక్షణ రంగంలో కూడా పరస్పర సహకారాన్ని పెంచుకుంటున్నాయి. భారతదేశం ప్రస్తుత, భవిష్యత్తు రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్షిపణులను కొనుగోలు చేస్తున్నారు.
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు బలం ఈ డీల్ కేవలం భారతదేశ రక్షణ రంగానికి మాత్రమే కాక, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్ని ఇవ్వనుంది. ఈ క్షిపణులు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నాలుగు సంస్థానాలలో ఒకటైన ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ ప్రాంతంలో తయారవుతాయి. ఈ ఉత్పత్తి ద్వారా అక్కడ 700 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ప్రస్తుతం మందగించిన యూకే ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాజెక్ట్ చాలా ఊరటనిస్తుందని భావిస్తున్నారు. భారతదేశానికి కూడా ఉక్రెయిన్‌కు అందించినంత స్థాయిలో క్షిపణులను బ్రిటన్ తయారు చేసి ఇవ్వనుంది.
మార్ట్‌లెట్ క్షిపణుల ప్రత్యేకతలు యూకేకు చెందిన మార్ట్‌లెట్ క్షిపణులు వాటి ప్రత్యేక లక్షణాల వల్ల చాలా అధునాతనమైనవిగా పేరు పొందాయి. ఇవి తక్కువ బరువు ఉండే మల్టీ రోల్ క్షిపణులు. ఈ క్షిపణులు గాలి నుండి నేల మీదికి, నేల నుండి గాలిలోకి, నేల నుండి నేల మీదికి టార్గెట్లను ఛేదించగలవు. అంటే, అన్ని రకాల లక్ష్యాలను నాశనం చేయడానికి ఇవి సరిపోతాయి. ఇంగ్లీష్ పురాణాలలో ఎప్పుడూ విశ్రాంతి తీసుకోని ఒక పక్షి పేరును (మార్ట్‌లెట్) ఈ క్షిపణికి పెట్టడం విశేషం. మార్ట్‌లెట్ క్షిపణులు బ్రిటన్ సైన్యంలో ప్రధాన ఆయుధాలలో ఒకటిగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్షిపణులను రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు కూడా బ్రిటన్ అందించింది.
భారత్‌లో యూకే ప్రధాని పర్యటన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ దేశం నుండి 125 మంది వ్యాపారవేత్తల ప్రతినిధి బృందంతో కలిసి భారతదేశంలో తమ మొదటి అధికారిక పర్యటనకు వచ్చారు. ముంబైలో స్టార్మర్, భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీల నేపథ్యంలోనే రక్షణ రంగంలో ఈ భారీ ఒప్పందంపై సంతకం జరిగింది.