Amarnath Yathra: అమర్‌నాథ్ పై ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ
ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..;
అమర్‌నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదులు చేసిన కుట్రను ఆర్మీ భగ్నం చేసింది కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రకుట్ర భగ్నమయ్యింది. ఎల్‌వోసీ దగ్గర ఉగ్రవాదుల చొరబాటును సైన్యం తిప్పికొట్టింది. అమర్‌నాథ్ యాత్రను టార్గెట్ చేసిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం ఎన్‌కౌంటర్‌లో కడతేర్చింది. కుప్వారా సెక్టార్‌లో పలు చోట్ల ఉగ్రవాదులు. సైన్యానికి మధ్య కాల్పులు జరిగాయి. అమర్‌నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కెరాన్ సెక్టార్ నుంచి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న సమాచారంతో గాలిపు చర్యలు చేపట్టారు. ఆర్మీతో పాటు బీఎస్‌ఎఫ్ , జమ్ముకశ్మీర్ పోలీసు బలగాలు కూంబింగ్‌లో పాల్గొన్నాయి.అమర్‌నాథ్
డ్రోన్లతో కూడా సరిహద్దుపై నిఘా పెట్టారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి చొరబాటుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. టెర్రరిస్టుల కదలికలను ముందే పసిగట్టిన భద్రతా బలగాలు అదను చూసి దాడి చేశాయి. ఉగ్రవాదుల రహస్య స్థావరం గుట్టురట్టు చేశాయి. పాకిస్తాన్‌లో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది ముగ్గురు పాకిస్తాన్ పౌరులే అని ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఐఎస్‌ఐ సహకారంతో ఉగ్రవాదులు కశ్మీర్‌లో మరో నరమేథానికి కుట్ర చేయడం సంచలనం రేపింది. కుప్వారా ఎన్‌కౌంటర్ తరువాత అమర్‌నాథ్ యాత్రకు మరింత భద్రతను కల్పించారు.
అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. ఈ యాత్ర మొదలైన తర్వా త 16 రోజుల్లోనే 3 లక్షల మందికిపైగా భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శించుకోవడంతో సరికొత్త రికార్డు నమోదైంది. జమ్ములోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి సోమవారం మరో 4,875 మంది భక్తులు బయల్దేరారు. ఆదివారం వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ 15,000 మందికిపైగా భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు.