Indian Army : శత్రువుల గుండెల్లో మరణ మృదంగం..రంగంలోకి 850 ఆత్మాహుతి డ్రోన్లు..భారత్ దెబ్బకు పాక్ విలవిల
Indian Army : భారత రక్షణ రంగం మరో భారీ ముందడుగు వేయబోతోంది. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా భారత సైన్యం అత్యంత ఆధునికమైన 850 కామికాజే డ్రోన్లను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా నేర్చుకున్న పాఠాలతో, భవిష్యత్తు యుద్ధాల్లో డ్రోన్ల ప్రాముఖ్యతను గుర్తించిన రక్షణ శాఖ, ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ నెల చివర్లో జరగనున్న రక్షణ కొనుగోలు మండలి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ డ్రోన్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది. ఈ డ్రోన్లను కేవలం ఆర్మీకే కాకుండా, నావికాదళం, వాయుసేన, ప్రత్యేక బలగాలకు కూడా అందజేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఈ డ్రోన్లన్నీ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైనవి. దాదాపు 850 డ్రోన్లతో పాటు వాటిని ప్రయోగించే లాంచర్లను కూడా భారతీయ కంపెనీలే తయారు చేయనున్నాయి. భారత సైన్యం ఇప్పటికే వివిధ రకాల డ్రోన్లను వాడుతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ప్రతి పోరాట విభాగంలో డ్రోన్లను అంతర్భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఏకంగా 30,000 డ్రోన్లను సేకరించాలని ఒక భారీ ప్రణాళికను రూపొందించారు. ఇది మన దేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
సైన్యంలో సరికొత్త మార్పుల ప్రకారం.. ప్రతి ఇన్ఫాంట్రీ బెటాలియన్లో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అశ్విని ప్లాటూన్ ఉండబోతోంది. ఈ ప్లాటూన్ బాధ్యత పూర్తిగా డ్రోన్ల నిర్వహణే. శత్రువుల స్థావరాలపై మెరుపు దాడులు చేయడం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో డ్రోన్లను నేరుగా ప్రయోగించడం వంటి క్లిష్టమైన పనులను ఈ అశ్విని ప్లాటూన్ చక్కబెడుతుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి భారత్ డ్రోన్లను పెద్ద ఎత్తున వాడింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేసిన ఆ దాడిలో డ్రోన్ల సాయంతో 9 స్థావరాలలో 7 స్థావరాలను మొదటి రోజే నేలమట్టం చేశారు.
సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచినప్పుడు కూడా మన డ్రోన్లు అద్భుతమైన పనితీరును కనబరిచాయి. శత్రువుల మౌలిక సదుపాయాలను, లాంచ్ ప్యాడ్‌లను డ్రోన్ల ద్వారా క్షిపణి తరహాలో ఢీకొట్టి ధ్వంసం చేయడంలో మన సైన్యం సక్సెస్ అయ్యింది. అందుకే, ఇప్పుడు భారీ ఎత్తున ఈ ఆత్మాహుతి (కామికాజే) డ్రోన్లను సమకూర్చుకోవడం ద్వారా శత్రువు కంటపడకుండానే వారిని కోలుకోలేని దెబ్బ తీసే సత్తా భారత్‌కు లభించనుంది. దీనివల్ల మన సైనికుల ప్రాణాలకు ముప్పు తగ్గడమే కాకుండా, ఖచ్చితత్వంతో కూడిన దాడులు సాధ్యమవుతాయి.