Ins tamal: నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తమల్..

చివరి విదేశీ యుద్ధనౌకగా గుర్తింపు;

Update: 2025-07-02 01:45 GMT

 భారత నౌకాదళంలోకి మరో యుద్ధ నౌక చేరింది. అత్యంత ఆధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ తమల్’   ఇండియన్ నేవీలోకి ప్రవేశించింది. రష్యాలోని కాలినిన్‌గ్రాడ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్ఐ ఎన్ఎస్ తమల్‌ను ప్రారంభించారు. రష్యా, భారత్‌కు చెందిన ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో దీనిని నౌకాదళంలోకి చేర్చారు. ఐఎన్ఎస్ తమల్ 125 మీటర్ల పొడవు, 3900 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది 30 నాట్ల కంటే ఎక్కువ వేగంతో పనిచేయగలదు. ఈ నౌకలో అధునాతన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ మిసైల్ సిస్టమ్, హెవీవెయిట్ టార్పెడోలు, రాడార్లు, సోనార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌లు వంటి అత్యాధునిక ఆయుధాలు, పరికరాలు అమర్చబడి ఉన్నాయి. అంతేగాక ఇతర క్షిపణులు, అత్యధునిక ఆయుధ వ్యవస్థలున్నాయి.

తమల్ రష్యా నుంచి అందిన ఎనిమిదో యుద్ధనౌక, రెండో తుషిల్ తరగతి యుద్ధనౌక. ఇది 2016లో కుదిరిన భారత్-రష్యా రక్షణ ఒప్పందంలో భాగం. దీని కింద నాలుగు తల్వార్-తరగతి స్టెల్త్ ఫ్రిగేట్‌లను నిర్మిస్తున్నారు. వీటిలో రెండు రష్యాలోని యాంటార్ షిప్‌యార్డ్‌లో, రెండు ఇండియాలోని గోవా షిప్‌యార్డ్‌లో నిర్మిస్తున్నారు. అంతేగాక దేశం బయట తయారు చేసి చివరి యుద్ధనౌక ఇదే కావడం గమనార్హం. దీని తర్వాత విదేశాల్లో నిర్మించిన యుద్ధ నౌకలు నావికాదళంలో చేరలేవు. ఎందుకంటే ఆత్మ నిర్భర్ భారత్ కింద ప్రతిదీ దేశీయంగానే తయారు చేస్తున్నారు.

Tags:    

Similar News