Indigo : ఇండిగోకు భారీ ఎదురుదెబ్బ.. ఫ్లైట్ రద్దుల కారణంగా రూ.1,800 కోట్ల వరకు నష్టం అంచనా.
Indigo : భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీ అయిన ఇండిగో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 మూడవ త్రైమాసికంలో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఇటీవల కాలంలో కంపెనీ ఎదుర్కొన్న విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ఇప్పటికే ఇండిగోకు రూ.1,800 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం రోజురోజుకు పెరుగుతుండటంతో మూడవ త్రైమాసికంలో కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీవ్రంగా ప్రభావితం కానుంది.
మొదటగా డిసెంబర్ 9 వరకు రద్దయిన టికెట్ల డబ్బును కంపెనీ ప్రయాణికులకు తిరిగి ఇవ్వాల్సి రావడంతో రూ.900 కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూ నష్టం జరిగింది. అయితే, విమాన ప్రయాణాలలో ఏర్పడిన అంతరాయాల కారణంగా రద్దయిన టిక్కెట్లపై ప్రయాణికులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు వస్తే, ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 1 నుంచి 9 తేదీల మధ్య 8.86 లక్షల PNR లను రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్యాసింజర్ చార్టర్ ప్రకారం, 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయిన లేదా రద్దయిన ఫ్లైట్ గురించి 24 గంటల ముందు ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోతే, ఎయిర్‌లైన్ రూ.10,000 లేదా బేసిక్ ఛార్జ్, ఇంధన ఛార్జీ వీటిలో ఏది తక్కువైతే అది పరిహారంగా చెల్లించాలి. ఈ నిబంధన ప్రకారం చూస్తే.. ఇండిగో డిసెంబర్ 9 వరకు రూ.886 కోట్ల కంటే ఎక్కువ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. రిఫండ్, పరిహారం కలిపితే మొత్తం నష్టం భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఎయిర్‌లైన్ కార్యకలాపాలు నెమ్మదిగా స్థిరపడుతున్న నేపథ్యంలో.. డిసెంబర్ 3 నుంచి 5 తేదీల మధ్య విమానాలు రద్దు అయిన లేదా దీర్ఘకాలం ఆలస్యం అయిన ప్రయాణికులందరికీ రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్‌ను ఇస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ వోచర్‌ను ప్రయాణికులు తరువాత 12 నెలల్లో తమ ఫ్లైట్‌లకు ఉపయోగించుకోవచ్చు. కంపెనీ ఈ పరిహారాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాల్సిన పరిహారానికి అదనంగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, బయలుదేరే సమయానికి 24 గంటల్లోపు ఫ్లైట్ రద్దైతే, ఫ్లైట్ బ్లాక్ టైమ్ ఆధారంగా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు పరిహారం ఇవ్వాలి.
అయితే భారీ స్థాయిలో ఫ్లైట్లు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం వల్ల వేల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వీరిలో ఎంతమందికి ఈ రూ.10,000 వోచర్ ప్రయోజనం లభిస్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.