Madhya Pradesh: మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను టూవీలర్‌తో ఢీకొట్టాడు..
ప్రేమకు నో చెప్పిందని యువతిని స్కూటీతో ఢీకొట్టిన మాజీ ప్రియుడు
తనతో ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు మాజీ ప్రియురాలిపై కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. వేగంగా స్కూటర్‌పై వచ్చి ఆమెను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి గాయపరిచాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పాత నేరస్తుడు కావడం గమనార్హం. కల్పనా నగర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు కొద్దికాలం క్రితమే నిందితుడితో తన సంబంధాన్ని తెంచుకుంది. అయితే, తిరిగి తనతో కలవాలంటూ అతడు ఆమెపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలోనే బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. ఆమె ఇందుకు అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నిందితుడు వేగంగా యాక్టివా స్కూటర్‌పై వచ్చి ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. అతడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు బాధితురాలు ఓ రాయి విసిరింది. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు స్కూటర్‌తో ఆమెను బలంగా ఢీకొట్టి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి.
ఈ దాడి అనంతరం బాధితురాలు హీరానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిపై దాడి, బెదిరింపులు, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడికి నేరచరిత్ర ఉన్నట్లు తేలింది. అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఏడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
"నిందితుడిని గుర్తించాం. అతని నేరచరిత్రను కూడా నిర్ధారించాం. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం. త్వరలోనే అరెస్టు చేస్తాం" అని హీరానగర్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది.