Norman Borlaug Award: ఒడిశా యువతికి నార్మన్ బోర్లాగ్ అవార్డ్
వరి సాగు చేసే చిన్నరైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసిన స్వాతి
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో స్వాతి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది. క్షేత్ర స్థాయి పరిశోధన, అనువర్తనలో ఆమె కృషికి గుర్తింపుగా 2023వ సంవత్సరానికి ఆమెకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఓ ట్వీట్‌లో తెలిపింది. ఆమె అసాధారణ యువ శాస్త్రవేత్త అని ప్రశంసించింది. ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో (ఐఆర్ఆర్ఐ) శాస్త్రవేత్తగా ఉన్నారు.
స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన యువతి. ఈ అవార్డు పొందడంపై స్పందించిన స్వాతి ఈ క్షణం తనకు మరో కొత్త ఒక ప్రారంభాన్ని ఇచ్చింది అన్నారు. ఫీల్డ్ సైంటిస్ట్‌గా తన ప్రయత్నాలను, వాదనను, పనిని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాసమని అభిప్రాయ పడ్డారు. స్వాతి 500 కంటే ఎక్కువ వరి రకాల కోసం 10,000 కంటే ఎక్కువ విస్తృతమైన ఆన్-ఫార్మ్ పరీక్షలను నిర్వహించారు, ఆసియా మరియు ఆఫ్రికా అంతటా వివిధ దేశాల్లోని విభిన్న పర్యావరణ పరిస్థితులలో ఈ ట్రయల్స్‌ని చాలా పరిశీలనతో అమలు చేయడం కోసం వేలాది మంది చిన్న రైతులతో కలిసి పనిచేశారు.
ఈ అవార్డు సాధించిన మూడవ భారతీయ వ్యక్తిగా, మొదటి ఒడిస్సా ప్రతినిధిగా రికార్డుకెక్కారు. డిమాండ్ ఆధారిత వరి విత్తన వ్యవస్థలు, పరీక్షించడం నుంచి అందరికీ అందుబాటు లోకి తీసుకురావడంలో నూతన ఆవిష్కరణలు కనుగొన్నందుకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ వివరించింది. అమెరికా లోని డెస్ మోయినెస్‌లో అక్టోబర్ 2426 తేదీల్లో 2023 నార్మన్ ఇ బొర్లాగ్ అంతర్జాతీయ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును స్వాతినాయక్ అందుకుంటారు. హరిత విప్లవ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ ఇ. బోర్లాగ్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఆకలిని నిర్మూలించి, ఆహారభద్రతకు కృషి చేసే 40 ఏళ్లలోపు వయసున్న శాస్త్రవేత్తలకు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తారు.