Chandrayaan 3: చందమామా.. మళ్లీ వస్తున్నాం...
జాబిల్లి గుట్టు విప్పేందుకు చంద్రయాన్-3.. ఇప్పటికే రెండుసార్లు చంద్రమండల అన్వేషణ... ఇతర గ్రహాలపై జీవాన్ని గుర్తించే ప్రయత్నం...ఇస్రో చరిత్రలో అత్యంత కీలక ప్రయోగం...;
జాబిల్లి ఊహ తెలియనప్పటి నుంచి మనతో పెనవేసుకున్న ఓ బంధం. అమ్మ గోరు ముద్దలతోపాటు మన జీవితంలో భాగమైన ఓ ఎమోషన్. పసి ప్రాయంలోనే చందమామ రావే జాబిల్లిరావే అని అమ్మ పాడే పాటతో మనకు పరిచయం అవుతుంది జాబిల్లి. అనంత విశ్వం మనకు సవాళ్లు విసురుతున్నా ఎందుకు మనకు జాబిల్లి(moon) అంటేనే అంత మక్కువ. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో మనిషి భూమిని దాటి అడుగు పెట్టిన ఏకైక ప్రదేశం చంద్రుడే. అందుకే అక్కడ ఏముందో తెలుసుకోవాలని... ఉవ్విళ్లూరుతున్నాడు. భూమికి సుమారుగా 3లక్షల 84వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుడు.
4 బిలియన్ సంవత్సరాల క్రితం ఓ చిన్న సైజు గ్రహం... భూమి(earth)ని అమాంతం ఢీ కొట్టడంతో చందమామ ఏర్పడి ఉండవచ్చనేది ఒక బలమైన వాదన. భూమికి సహజ ఉపగ్రహంలా తిరుగతూ భూమిపై సముద్రంలో అలలు ఏర్పడటానికి, వాతావరణాన్ని ప్రభావితం చేయటానికి కారణమౌతుంది జాబిల్లి(moon) . చల్లని వెన్నెలను ఇచ్చే చందమామను మనం చూసేది కేవలం ఒకవైపే. కంటికి కనిపించని అవతలి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. చందమామను చేరుకోవడానికి, అక్కడ మనదైన ముద్ర వేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) దశాబ్దాలుగా పరితపిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగమే చంద్రయాన్(chandrayaan)
2003 ఆగస్టు 15 స్వాతంత్ర వేడుకల్లో తొలిసారిగా అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్(atal bihari vajpayee) చంద్రయాన్ ప్రయోగం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. దేశంలో వివిధ విభాగాలకు 100 మంది పెద్ద శాస్త్రవేత్తలు చంద్రయాన్ ప్రయోగంపై రోడ్ మ్యాప్ ఇచ్చారు. అలా చంద్రయాన్ ప్రయోగానికి అంకురార్పణ జరిగింది. 2008లో చంద్రయాన్(chandrayaan) పేరుతో ఇస్రో తొలి ప్రయోగం చేపట్టింది. 2008 అక్టోబరు 22న పీఎస్‌ఎల్వీ(PSLV)-సీ11 రాకెట్ ద్వారా చంద్రయాన్-1 ప్రయోగించారు. తొలి ప్రయత్నంలోనే చంద్ర కక్ష్యలోకి సులువుగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు రూ.380 కోట్ల ఖర్చుతో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని గుర్తించింది. 2019న జూలై 15న GSLV-మార్క్3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రయోగం జరిగింది. చంద్రకక్ష్యలోకి విజయవంతంగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఆర్బిటల్ ద్వారా ల్యాండర్ నుంచి రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దింపే ప్రయత్నం చేశారు. అన్నీ సజావుగా సాగినా చివర్లో ల్యాండర్ సురక్షితంగా దిగలేకపోయింది. ఈ ప్రయోగ వ్యయం దాదాపు రూ.978 కోట్లు.
ఇప్పుడు చంద్రయాన్ 3తో మరోసారి ప్రపంచ దృష్టి భారత్ వైపునకు తిరిగింది. చంద్రుడి మీద రహస్యాల ఛేదనకు ఈ మిషన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ విషయంలో చంద్రయాన్-1, చంద్రయాన్-2తో ఎంతో అనుభవాన్ని గడించిన ఇస్రో చంద్రయాన్-3తో సత్తా చాటనుంది. చంద్రయాన్ 3 ఖర్చు రూ.615 కోట్ల రూపాయలు. చంద్రయాన్-3 విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరుతుంది. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్ ప్రయత్నిస్తోంది.
ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు ఎందుకంటే...
ఎందుకంటే మానవ మేధకు ఇప్పటికీ అందని అంతరిక్ష రహస్యాల గుట్టు తెలుసుకోవడానికి. చంద్రుడిపై ఉన్న ఖనిజ వనరులు, నీరు, ఇంధన నిల్వలను గుర్తించి, అవి మనకు ఏమేరకు ఉపయోగపడుతాయో అంచనా వేయడానికి. ఇతర గ్రహాల జీవాన్ని కనుక్కోడానికి కూడా. భూమి నుంచి కనిపించే చంద్రుడికి ఆవలివైపున దక్షిణ ధృవంలో అపార జలవనరులున్నాయని భావిస్తున్నారు. చంద్రయాన్-1లోనే ఇస్రో అక్కడి జలవనరుల జాడలు గుర్తించింది. ఆ ప్రాంతంలోనే పరిశోధనలు చేపట్టడానికి వీలుగా రోవర్‌ను అక్కడ దించనుంది. పైగా చంద్రుడిపైన మనం చూసేది ఎప్పుడూ ఓ వైపు మాత్రమే. ఆ రెండో వైపు ఏముందనేది ఎవరికీ తెలియదు. అక్కడ సూర్యకాంతి పడదు కాబట్టి మనం భూమిపైనుంచి ఎప్పుడూ ఓ వైపు మాత్రమే చూస్తున్నాం. సో.... రెండో వైపు ఏముందో తెలుసుకోవాలనేది కూడా ఈ ప్రయోగం ప్లాన్.
చంద్రయాన్-3 విజయవంతమైతే అంతరిక్ష సాంకేతికతలో భారత్ కు పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. భారత అంతరిక్ష సాంకేతిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించవచ్చు. చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో అభివృద్ధి చేసిన, అంతరిక్ష రంగానికి సంబంధించిన హార్డ్ వేర్, తక్కువ ధరకు కచ్చితమైన ఫలితాలను ఇచ్చే విడి భాగాల వంటి వాటికి ప్రచారం దక్కుతుంది దీంతో వాటిని సరఫరా చేసే దేశంగా భారత్ మారుతుందని తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైతే విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. అంతరిక్షంలోని రహస్యాల అన్వేషణ విషయంలో చంద్రుడిపై చేసే పరిశోధనలు ఓ మార్గాన్ని చూపిస్తాయి. భారత అంతరిక్ష రంగ ఆదాయం 2025లోపు దాదాపు రూ.1.55 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. 2020లో ఈ ఆదాయం దాదాపు రూ.79.3 వేల కోట్లుగా ఉంది.
మీకు గుర్తుందా... .
చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటార్‌తో వెళ్లిన చంద్రయాన్–2 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రు డి ఉపరితలంపై క్షేమంగా దిగలేకపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 2019 సెప్టెంబర్ 6న క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రయోగం విఫలం కావడంతో అప్పటి ఇస్రో చైర్మన్ శివన్ ప్రధాని మోదీ సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. దేశ ప్రజలంతా సానుభూతి ప్రదర్శించారు. చంద్రయాన్–2తో పోలిస్తే చంద్రయాన్–3 ప్రయోగం చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇస్రో తర్వాతి గురి సూర్యుడే
ఇస్రో తర్వాత సూర్యగ్రహంపై గురిపెట్టింది. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు పీఎ్‌సఎల్వీ-సీ 56 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి షార్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,412 కిలోల బరువు గల ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సౌర తుఫాన్ సమయంలో వెలువడే సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయనుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ.378 కోట్లు. ఆగస్టు చివర్లో ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.