World Cup ప్రపంచకప్ కోసం భారత్ లో అడుగుపెట్టనున్న పాక్
ప్రకటన విడుదల చేసిన పాకిస్థాన్ విదేశాంగశాఖ;
వన్డే ప్రపంచకప్ కోసం భారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వరల్డ్‌కప్ ప్రారంభం కానుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ జట్టు వస్తుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ పాక్ విదేశాంగ శాఖ పచ్చజెండా ఊపడంతో సందిగ్ధతకు తెరపడింది.
ఈ ఏడాది జరిగే ICC క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనేందురు పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదనే నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అందువల్ల ఈ ఏడాది జరిగి ICC ప్రపంచ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టును భారత్‌కు పంపనున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు అడ్డంకి కాకూడదని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. అయితే తమ జట్టు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఈ విషయాన్ని ICCకి, భారత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది.
అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో తమ జట్టు ఎప్పటిలాగే పాల్గొంటుందని, తమ దేశం నిర్మాణాత్మక, బాధ్యతాయుత విధానాన్ని అవలంభిస్తుందనేదానికి తమ నిర్ణయమే నిదర్శనమని ఆ ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు ఢోకా ఉండబోదనే ఆశిస్తున్నట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టబోమని పాకిస్తాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పాక్ జట్టు భద్రతపై తీవ్రమైన ఆందోళన కలుగుతోందని పాకిస్తాన్ విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని ఐసీసీ, బీసీసీఐకి తెలియజేస్తామని వెల్లడించింది. భారత్‌లో పాక్ జట్టుకు పూర్తి భద్రత, రక్షణ ఉంటుందని నమ్ముతున్నామని తెలిపింది. ఆసియా కప్ ఆడేందుకు పాక్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచకప్ కోసం పాక్ ఇక్కడికి వస్తుందా? రాదా? అనే సందేహాలు నెలకొనగా.. ఇప్పుడు స్పష్టత వచ్చింది.