jk: జమ్ముకశ్మీర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం

తప్పిన పెను ప్రమాదం.. మరో ప్రాంతంలో ఇద్దరు ముష్కరులు హతం;

Update: 2024-10-06 05:30 GMT

జమ్మూకశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. జమ్మూలోని ఘరోటా ప్రాంతంలో రోడ్డు పక్కన పేలుడు పదార్థాలను గుర్తించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌.. పేలుడు పదార్థాలను నిర్మానుష్య ప్రదేశంలో ధ్వంసం చేసింది. పేలుడు పదార్థం దొరికిన ప్రాంతంలో సైన్యంతో సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. శుక్రవారం కుప్వారాలోని గుగల్ ధార్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు చెప్పారు. ‘జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల ప్రవేశాన్ని అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది’ అని తెలిపారు.

వేర్పాటువాది యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను అహింసా మార్గంలో పయనిస్తున్నానని, సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టినట్లు ఉపా ట్రైబ్యునల్ ముందు యాసిన్ మాలిక్ తెలిపాడు. తాను గాంధేయ మార్గంలో స్వతంత్ర కశ్మీర్ కోసం పోరాడుతున్నట్లు వెల్లడించాడు. ఆయుధాలు కూడా వదిలిపెట్టానని చెప్పాడు. అయితే యాసిన్ మాలిక్ ఆయుధాలు వదిలినా ఇప్పటికీ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాడని కేంద్రం పేర్కొంది.

ఎన్ కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా మావోలు

ఛత్తీస్ గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని బస్తర్ ఐజీ సుందర్ వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ వాంటెడ్ మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. విజయవాడకు చెందిన కమలేష్ అలియాస్ ఆర్కే కూడా మృతి చెందినట్లు ఐజీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఐజీ వెల్లడించారు.

Tags:    

Similar News