JAISHANKER: కెనడాపై జైశంకర్ తీవ్ర ఆగ్రహం
బెదిరించినా.. స్వాతంత్యమేనట... కెనడాది రెండు నాల్కల ధోరణి;
కెనడాతో సంబంధాలపై ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడం కష్టమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. 1945తర్వాత ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువగా ఉండేదని, గడిచిన 20-25 ఏళ్లలో పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. పాశ్చాత్యేతర దేశాల వాటా, భాగస్వామ్యం, ప్రభావం పెరిగిందన్నారు. వివాదాలు, ఘర్షణలు, వాదనలు సహజమేనని, ఈక్రమంలో కొన్నిదేశాల మధ్య సంబంధాలు అంత సాఫీగా ఉండవని పేర్కొన్నారు. తనకొక న్యాయం, ఇతరులకొక న్యాయం అన్నట్టుగా కెనడా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కెనడా రెండు నాల్కల ధోరణిని ఎండగట్టేందుకు ‘ద్వంద్వ ప్రమాణాలు’ అనే పదం కూడా సరిపోదన్నారు. భారత నేతలు, దౌత్యవేత్తలను కెనడా పౌరులు బహిరంగంగా బెదిరిస్తున్నారని చెబితే.. దాన్ని వాక్ స్వాతంత్య్రంగా కెనడా అభివర్ణిస్తోందని జై శంకర్ మండిపడ్డారు. చివరకు కెనడాలోని భారత హైకమిషనర్‌ను అక్కడి పౌరులు బెదిరించినా భావ ప్రకటన స్వేచ్ఛగానే పరిగణించాలని అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్‌లోలా కెనడాలో లేదు..
భారత్‌లోని కెనడా దౌత్యవేత్త సౌత్‌బ్లాక్ నుంచి కోపంతో బయటకు వచ్చారని ఓ భారత జర్నలిస్టు పేర్కొనడాన్ని కూడా కెనడా సీరియస్‌గా తీసుకుందని జైశంకర్ గుర్తు చేశారు. విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కెనడా ప్రభుత్వం ఆరోపించిందని.. తెలిపారు. భారత దౌత్యవేత్తల సంక్షేమం, భద్రత గురించి కెనడాకు పట్టడం లేదని... అదే భారత్‌లో.. కెనడా దౌత్యవేత్తలకు చాలా స్వేచ్ఛ ఉందని... భారత సైన్యం, పోలీసుల సమాచారాన్ని వాళ్లు స్వేచ్ఛగా సేకరించుకోవచ్చని ఎస్.జైశంకర్ తెలిపారు.
రష్యాతో సంబంధాలపై..
రష్యాతో భారత్ సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత చరిత్రను పరిశీలిస్తే.. ఆ దేశం మనకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదని అన్నారు. ప్రస్తుతం రష్యాలో పరిస్థితి భిన్నంగా ఉందని... పశ్చిమ దేశాలతో రష్యా సంబంధాలు స్పష్టంగా విచ్ఛిన్నమయ్యాయిని తెలిపారు. రష్యా ఇప్పుడు ఆసియా వైపు చూస్తోందని... పెద్ద వనరుల వినియోగదారులుగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ దశలో రష్యాకు ప్రధాన సహజ వనరుల శక్తిగా భారతదేశంతో అనుబంధం ఉందన్నారు. . రష్యాతో ఆర్థిక సంబంధంతో పాటు వ్యూహాత్మకమైన సంబంధం కూడా ఉందని జైశంకర్ అన్నారు. లడఖ్‌లో ఎల్‌ఏసీపై చైనాతో కొనసాగుతున్న వివాదంపై మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఇండియా- చైనా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని చెప్పారు. ఈ ఒప్పందంతో గతంలో పరిస్థితులు తిరిగి వస్తాయన్నారు. 2020కి ముందు పరిస్థితిని తిరిగి తీసుకురావడానికి భారతదేశం-చైనా పెట్రోలింగ్‌పై ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన చెప్పారు. తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.