NHAI : హైవేలపై ప్రమాదాలకు చెక్..రిలయన్స్ జియోతో NHAI ఒప్పందం

Update: 2025-12-03 06:30 GMT

NHAI : దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఎదురయ్యే వివిధ ప్రమాదాల గురించి ముందుగానే తెలియజేసేందుకు ఒక అడ్వాన్స్‌డ్ అలర్ట్ సిస్టమ్‌ను అమలు చేయడానికి రిలయన్స్ జియో సంస్థతో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. ప్రయాణికులకు వారి మొబైల్ ఫోన్ల ద్వారా ప్రమాదాల గురించి హెచ్చరిక సందేశాలను ముందుగానే పంపించడం.

ఈ ఆటోమేటెడ్ అలర్ట్ సిస్టమ్ ద్వారా రోడ్డుపై ఉన్న వివిధ ప్రమాదాల గురించి ప్రయాణికులకు సమాచారం అందుతుంది. ఉదాహరణకు, మీరు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు.. ముందుకు యాక్సిడెంట్ జోన్ ఉంటే, బీడుగా తిరిగే పశువుల సంచారం ఎక్కువగా ఉంటే, దట్టమైన మంచు కమ్మిన ప్రాంతం ఉంటే, లేదా అత్యవసర మలుపులు లేదా మరేదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే. ఇలాంటి పరిస్థితులలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి, వేగాన్ని తగ్గించుకోవడానికి లేదా జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి ఈ మెసేజులు సహాయపడతాయి. తద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని NHAI భావిస్తోంది.

ప్రమాదాల గురించి ముందస్తు హెచ్చరిక సందేశాలను వివిధ మార్గాలలో ప్రయాణికులకు పంపేందుకు ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ హెచ్చరికలు ఎస్‌ఎంఎస్ (SMS) ద్వారా, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా, లేదా అత్యవసర పరిస్థితుల్లో హై ప్రయారిటీ కాల్స్ రూపంలో కూడా పంపబడతాయి. ఈ అలర్ట్‌లను స్వీకరించడం ద్వారా, వాహనదారులు ఎంతో అప్రమత్తంగా తమ వాహనాలను నడుపుతారు. క్రమంగా ఈ అలర్ట్ సిస్టమ్ ను రాజమార్గ యాత్ర మొబైల్ యాప్, ఎమర్జెన్సీ సహాయవాణి 1022 వంటి NHAI ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతానికి, జాతీయ రహదారులపై ప్రయాణించే రిలయన్స్ జియో యూజర్లందరి మొబైల్‌లలో ఈ ఆటోమేటెడ్ అలర్ట్ సిస్టమ్ పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న జియో పవర్ఫుల్ 4జీ, 5జీ నెట్‌వర్క్‌లు ఈ అధునాతన వ్యవస్థ అమలుకు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, NHAI కేవలం జియోకు మాత్రమే ఈ సేవలను పరిమితం చేయదలుచుకోలేదు. రాబోయే రోజుల్లో NHAI ఇతర టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్ వంటి సంస్థలతో కూడా ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. తద్వారా దేశంలోని అన్ని టెలికాం వినియోగదారులకు ఈ భద్రతా సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News