Joe Biden: రిపబ్లిక్‌డే వేడుకలకు బైడెన్ రాకపోవచ్చేమో
‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం, ఎన్నికల ప్రచారంలో బైడెన్ బిజీ
వచ్చే నెల జనవరిలో జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ఆరంభంలో అధ్యక్షుడు బైడెన్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం చేయాల్సి ఉండడం, మరోవైపు ఎన్నికల ప్రచారం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో భారత్‌కు ప్రయాణించకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు భారత్‌కు సమాచారం అందిందని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
జనవరి 26, 2024న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడు బైడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సెప్టెంబర్ నెలలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలకు బైడెన్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు భారత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలావుంచితే.. జనవరిలో జరగాల్సిన క్వాడ్ సదస్సును డిసెంబర్ చివరిలోనే ఏర్పాటు చేయాలని ఆతిథ్య భారత్ నిర్ణయించింది. 2024లో నిర్వహణకు ప్రతిపాదించినప్పటికీ ప్రతిపాదిత తేదీల్లో అన్ని భాగస్వామ్య దేశాలు పాల్గొనే అవకాశం లేకపోవడంతో సవరించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా క్వాడ్ అనేది అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన కూటమి. ఉమ్మడి ప్రయోజనాల రక్షణకు ఇది ఏర్పాటైంది.
మరోవైపు 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల నేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. 2007లో పుతిన్ (రష్యా), 2008లో నికోలస్ సర్కోజీ(ఫ్రాన్స్), 2015లో బరాక్ ఒబామా (అమెరికా), 2016లో హోలన్ (ఫ్రాన్స్)లు అతిథులుగా హాజరయ్యారు.
2021లో నాటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను చీఫ్ గెస్ట్ ఆహ్వానించారు. కానీ, కొవిడ్ కేసులు పెరగడం వల్ల ఆయన పర్యటన రద్దైంది. 2018లో ఆసియాన్ దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు. 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సీసీ హాజరయ్యారు. ఒకవేళ ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు బైడెన్ గణతంత్ర ఉత్సవాలకు వస్తే ఇప్పటివరకు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన రెండో అమెరికా అధ్యక్షుడిగా ఆయన నిలుస్తారు.