Supreme Court: నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర;
భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గురువారం నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేస్తారు. దీంతో నవంబర్ 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారు. సంజీవ్ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతమున్న సీజేఐ చంద్రచూడ్ 2022 నవంబర్ 8 నుంచి ఈ పదవిలో ఉన్నారు.
న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించిన సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల వినియోగాన్ని ఆయన సమర్థిస్తూ.. అవి పూర్తి భద్రమైనవని, దాని వల్ల బోగస్ ఓట్లు, బూత్‌ల రిగ్గింగ్‌ను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఎలక్టోరల్ బాండ్లపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఖన్నా కూడా ఉన్నారు. 370 అధికరణ రద్దును సమర్థిస్తూ తీర్చు ఇచ్చిన ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడే.