Chief Justice of India : సుప్రీం సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం

Update: 2024-11-11 09:45 GMT

సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్‌ ఖన్నా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సహా తదితరులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో కొత్త సీజేఐ బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది మే 13 వరకు ఈయన పదవిలో కొనసాగనున్నారు.

2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా... ఈ ఆరేళ్ల కాలంలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలక తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణం 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. 1960 మే 14న జన్మించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. కుటుంబంలో మూడో న్యాయమూర్తి. తండ్రి దేవరాజ్‌ ఖన్నా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, పెదనాన్న హెచ్‌.ఆర్‌.ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. దిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. 1983లో దిల్లీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకొని ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ట్యాక్సేషన్, ఆర్బిట్రేషన్, కమర్షియల్, కంపెనీ లా కేసులు వాదించారు. 2005 జూన్‌ 25న దిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Tags:    

Similar News