Karnataka High Court : కమల్ హాసన్ కు దిమ్మతిరిగే ప్రశ్నలు.. హైకోర్టులో జరిగిన వాదనలు ఇవే
సినీనటుడు కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. థగ్స్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన చేసుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కమల్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం సినీ నటుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వచ్చారా..? అంటూ మండిపడింది. "మీరేమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా..? ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు..? కన్నడ ప్రజలు మిమ్మ ల్ని ఏమి అడిగారు..? కేవలం క్షమాపణలే కదా.. ఒక్క క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు కమల్ హాసన్ కావొచ్చు.. ఎంత పెద్ద నటుడైనా కావొచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు. మీకు లేదు. మీ కామెంట్స్ వల్ల అశాంతి ఏర్పడింది. నీరు, భూమి, భాష.. ఇవి ప్రజలకు ముఖ్యమైనవి. ఈ దేశ విభజన భాషా ప్రాతిపదికన జరిగింది. ఏ భాష మరొక భాష నుంచి పుట్టదు. మీ వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశారని" న్యాయమూర్తి నాగ ప్రసన్న వ్యాఖ్యానించారు.
"మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేరు. కానీ అందుకు క్షమాపణలు చెప్పాచ్చు. పగలగొట్టి వండేసిన గుడ్లను మీరు పగలగొట్టని పూర్వ స్థితికి తీసుకెళ్లలేరు" అని కమల్ కు హైకోర్టు హితవు పలికింది. గతంలో ఎప్పుడో ఏదో జరిగిపోయి ఉంటే, దాన్ని రివర్స్ చేయలేమనే అర్థాన్ని ఇచ్చే ఒక ఆంగ్ల నానుడిని ప్రయోగిస్తూ న్యాయస్థానం ఈ కామెంట్స్ చేసింది. ఇప్పటికైతే ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం. మీరు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాప ణలు చెప్పండి అని హితవు పలికారు. కాగా, కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ప్రస్తుతానికి సినిమాను కర్ణాటకలో విడుదల చేయనని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కన్నడ భాష, ప్రజల పట్ల తనకున్న నిజాయితీగల గౌరవాన్ని వ్యక్తపరుస్తూ నటుడు పంపిన లేఖను కూడా న్యాయవాది కోర్టుకు సమర్పించారు.