Karnataka: ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లొస్తుండగా.. యువజంట మృతి
లారీని ఢీ కొట్టడంతో నుజ్జునుజ్జు అయిపోయిన బైక్
కర్ణాటకలో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లిన కాబోయే భార్యాభర్తలు విగతజీవులయ్యారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డారు. దీంతో వివాహ ఏర్పాట్లతో సందడిగా ఉన్న ఇంట్లో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొప్పల్ తాలూకాలోని హనుమాన హట్టి గ్రామానికి చెందిన కరియప్ప(26)కు కరతగి తాలూకాలోని ముస్తూరు గ్రామానికి చెందిన కవితతో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల్లో వివాహం కోసం ఏర్పాట్లు జరుగుతుండగా.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లిన కరియప్ప, కవితలు బైక్ పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన మరో లారీ బైక్ ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ నుజ్జునుజ్జుగా మారింది. తీవ్ర గాయాలపాలైన కవిత అక్కడికక్కడే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా కరియప్ప తుదిశ్వాస వదిలాడు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంట మృత్యువాత పడటంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.