Karnataka Governmen : సినిమా టికెట్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ ధరలను రూ. 200లకు పరిమితం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నిర్ణయం వినోదపు పన్నుతో కలిపి అన్ని రకాల సినిమాలకు వర్తిస్తుంది. సినిమా టికెట్ ధర రూ. 200 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఈ నిబంధన సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లకు కూడా వర్తిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం, బాల్కనీ, ప్రీమియం వంటి సీటు విభాగాల మధ్య ధరల వ్యత్యాసం ఉండదు. అన్ని సీట్లకు ఒకే ధర వర్తిస్తుంది. ఈ రూల్ కేవలం కన్నడ సినిమాలకు మాత్రమే కాకుండా, ఇతర భాషలైన తెలుగు, తమిళం, హిందీ తదితర చిత్రాలన్నింటికీ వర్తిస్తుంది. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే తెలియజేయడానికి ప్రభుత్వం 15 రోజుల గడువు ఇచ్చింది. ఆ తర్వాత తుది నిర్ణయం వెలువడుతుంది. గతంలో కూడా 2017లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు, కానీ మల్టీప్లెక్స్ యజమానుల వ్యతిరేకత మరియు కోర్టు వివాదాల కారణంగా అది అమలు కాలేదు. ఇప్పుడు తిరిగి అదే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం వల్ల తమ ఆదాయం తగ్గుతుందని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.