Karnataka: ఇస్లాం మతంలోకి మారకపోతే.. అత్యాచారం కేసు పెడతా..
పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త;
వాళ్లిద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2024లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పెళ్లైన కొంత కాలం తర్వాత తన భార్య తనును బలవంతంగా మతం మార్చిందని ఆరోపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో వెలుగుచూసింది. తహసీన్ హోసమణితో తనకు మూడేళ్లుగా సంబంధం ఉందని విశాల్ కుమార్ గోకవి తెలిపాడు. ఆ తర్వాత 2024 నవంబర్‌లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నామని వెల్లడించాడు.
అయితే, వివాహం తర్వాత, ముస్లిం ఆచారాల ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని హోసమణి తనపై ఒత్తిడి తెచ్చిందని ఆయన ఆరోపించాడు. అయితే వివాహ బంధంలో కలహాలకు చోటు ఇవ్వకూడదని భార్య చెప్పిన దానికి అంగీకరించి ఏప్రిల్ 25న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఆ వేడుకలో తనకు తెలియకుండానే తన పేరు మార్చారని గోకవి ఆరోపించాడు. ఆ కార్యక్రమంలో ఒక ‘మౌల్వీ’ (ముస్లిం మతాధికారి) తనకు తెలియకుండానే మతం మార్చాడని కూడా చెప్పాడు.
ముస్లిం ఆచారాల ప్రకారం గోకవి హోసామణిని వివాహం చేసుకుంటున్నట్లు చూపించే వీడియో వైరల్ అయింది. జూన్ 5న హిందూ ఆచారాల ప్రకారం తన కుటుంబం వివాహానికి సన్నాహాలు చేసిందని గోకవి తెలిపాడు. హోసామణి మొదట అంగీకరించిందని, కానీ తరువాత ఆమె కుటుంబం ఒత్తిడితో వెనక్కి తగ్గిందని ఆరోపించాడు. తాను ఇస్లాం మతంలోకి మారకపోతే, తనపై అత్యాచారం కేసు పెడతానని ఆమె తనను హెచ్చరించిందని గోకవి ఆవేదన వ్యక్తం చేశాడు. హోసామణి, ఆమె తల్లి బేగం బాను తనను నమాజ్ చేయాలని, జమాత్‌కు హాజరు కావాలని బలవంతం చేశారని కూడా గోకవి ఆరోపించాడు. ఈ వ్యవహారంపై గోకవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 299, సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.