Delhi CM : జైలు నుంచే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడుపుతారు : అతిషి

Update: 2024-03-22 06:15 GMT

ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) అరెస్టు చేయడంతో, ఢిల్లీ మంత్రి అతిషి కీలక విషయాలు వెల్లడించారు. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అవసరమైతే ప్రభుత్వాన్ని జైలు నుండే నడిపిస్తారన్నారు. మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన అతిషి.. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ అరెస్టు చేయడం రాజకీయ కుట్రేనని ఆరోపించారు. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగానే ఉంటారని కూడా ఆమె అన్నారు.

"అవసరమైతే, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని జైలు నుండి నడిపిస్తారని మేము ముందే చెప్పాము. అతను ప్రభుత్వాన్ని నడపగలడు, అలా చేయకుండా ఏ రూల్ అతన్ని నిరోధించదు. అతను దోషిగా నిర్ధారించబడలేదు. కావున అతనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటాడు" అని అతిషి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేజ్రీవాల్‌ను చూసి భయపడుతున్నారని, ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలకు ఒక్క పైసా కూడా దొరకలేదని ఆమె ఆరోపించారు.

"భారీ సంఖ్యలో పోలీసులు, పారామిలటరీ బలగాలు (కేజ్రీవాల్ నివాసం వెలుపల) హాజరుకావడంతో, ఈడీ అతన్ని అరెస్టు చేస్తుందని స్పష్టమైంది. దర్యాప్తు ప్రారంభించిన గడచిన రెండేళ్లలో, ఈడీ, సీబీఐ.. ఆప్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇళ్లపై దాడులు నిర్వహించాయి. వారికి ఒక్క పైసా కూడా దొరకలేదు’’అని మంత్రి అన్నారు.

Tags:    

Similar News