శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఐదు లక్షల రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ కవరెజీని కల్పిస్తున్నట్లు ట్రావన్‌కోర్ దేవస్థానం ప్రకటించింది. ఏటా శబరిమలకు కేరళ నుంచే కాకుండా ఏపీ, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటుంటారు. మండలం, మకరజ్యోతి యాత్ర సమయంలో ఇరుముడితో వెళ్లే స్వాములతో పాటు సాధారణ భక్తులు సైతం శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. ఈ ఏడాది మండలం- మకరవిలక్కు సమయంలో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి 5లక్షల ఉచిత బీమా కల్పించాలని నిర్ణయించారు. యాత్రకు వచ్చిన భక్తులు ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు తరలించే బాధ్యతను కూడా ట్రావన్‌కోర్ దేవస్థానమే తీసుకోనుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షల రూపాయలను అందజేయనుంది.