దక్షిణ కొరియాకు చెందిన కియా ఇండియా కార్లను త్వరగా డెలివరీ చేసేందుకు కంపెనీ కొత్త రవాణా సామర్ధ్యాన్ని పెంచుకుంది. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా కార్ల రవాణాకు డబుల్ డెక్కర్ సరకు రైళ్లను ఉపయోగిస్తోంది. సత్యసాయి జిల్లా పెనుగొండ రైల్వే స్టేషన్ నుంచి డబుల్ డెక్కర్ రవాణా రైలు ద్వారా కియా కంపెనీ కార్లను పంపిస్తోంది. డీలర్లకు వీటిని వేగంగా చేర్చేందుకు వీలు కలుగుతుందని, కస్టమర్లకు త్వరగా వీటిని అందించవచ్చని కంపెనీ తెలిపింది. కంపెనీకి చెందిన సోనెట్, సెల్టోస్ వంటి ఎస్ యూవీలను ఈ రైలు ద్వారా రవాణా చేస్తున్నారు. ఫిబ్రవరిలో కియా కార్ల అమ్మకాలు 4.5 శాతం పెరిగి 2,53,850 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ ఫిబ్రవరిలో సెరాస్ పేరుతో మరో ఎస్ యూవీని తీసుకు వచ్చింది. ఎగుమతులు 4.4 శాతం పెరిగి 207,462 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.